ఈ ఏడాదిలోనే ప్రైవేటీకరణ పూర్తి! 

21 May, 2021 03:17 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ పలు సవాళ్లు విసురుతున్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22)లోగా ఎంపిక చేసిన పీఎస్‌యూల ప్రైవేటీకరణను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ తదితరాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ దిగ్గజాలలో ఇప్పటికే వాటా విక్రయ(డిజిన్వెస్ట్‌మెంట్‌) సన్నాహాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుత ఏడాది ముగిసేలోగా ప్రయివేటైజేషన్‌ను పూర్తి చేయాలని కాంక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే మహమ్మారి కారణంగా ప్రయాణాలపై ఆంక్షలకు తెరలేచిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీల కొనుగోలుకి సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదికలను రూపొందించడం తదితర అంశాలకు విఘాతం కలుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే సెప్టెంబర్‌ నుంచీ పరిస్థితులు అనుకూలించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.

ప్రయివేటైజేషన్‌ ప్రక్రియలో రెండో దశకు చేరిన కంపెనీల జాబితాలో ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్‌ కార్పొరేషన్‌తోపాటు.. పవన్‌ హంస్, బీఈఎంఎల్, ఎన్‌ఐఎన్‌ఎల్‌ చోటు చేసుకున్నాయి. ఈ సీపీఎస్‌ఈలలో వాటా కొనుగోలుకి ఇప్పటికే పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం(ఈవోఐ) చేశాయి. ఈ ఏడాదిలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే రూ. 32,835 కోట్లు అధికంకాగా.. తాజా లక్ష్యంలో రూ. లక్ష కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో వాటా విక్రయం ద్వారానే సమీకరించాలని ఆశిస్తుండటం గమనార్హం!  

మరిన్ని వార్తలు