ఇంటర్నెట్‌పై బడా కార్పొరేట్ల ఆధిపత్యం! కేంద్ర ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు

17 Dec, 2021 15:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ను మంచికి వినియోగించడాన్ని ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇంటర్నెట్‌ ఎప్పటికీ స్వేచ్ఛాయుతంగానే ఉంటుందని, దీనిపై బడా కార్పొరేట్ల ఆధిపత్యం ఉండబోదని భరోసా ఇచ్చారు. ‘ఫ్యూయల్‌ ఫర్‌ ఇండియా 2021’ పేరుతో మెటా (ఫేస్‌బుక్‌) నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.

పరస్పర గౌరవం, ప్లాట్‌ఫామ్‌–యూజర్ల మధ్య జవాబుదారీతనం అనే సంస్కృతి అభివృద్ధి చెందేలా ఇంటర్‌మీడియరీలు, మెటా వంటి పెద్ద సంస్థలు చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వందకోట్లకు పైగా భారతీయులు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నందున దీన్ని భద్రమైన, విశ్వసనీయమైన సాధనంగా ఉండేలా చూడనున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ణు మంచికోసం వినియోగించేలా చూసేందుకు ప్రైవేటు కంపెనీలు, దేశ, విదేశీ సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కలసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.  
 

చదవండి:గూగుల్‌లో హ్యాక్‌ బగ్‌.. గుర్తించిన భారతీయుడికి నజరానా

మరిన్ని వార్తలు