‘సబ్సిడీపై స్మార్ట్‌ఫోన్లు’.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పందన

14 Dec, 2021 16:20 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఇంకా ఫీచర్‌ ఫోన్లను వినియోగిస్తున్న వారిని స్మార్ట్‌ఫోన్ల వైపు మళ్లించడానికి సబ్సిడీపై హ్యాండ్‌సెట్లను అందించాలన్న ప్రతిపాదనలపై మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. ప్రభుత్వం ఇప్పటికే దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుందన్నారు. ‘ప్రస్తుతం మొబైల్‌ ఫోన్ల తయారీకి సంబంధించి ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్‌ ఉంది. గత నాలుగైదేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో మెరుగైన మొబైల్‌ ఫోన్ల ధరలు రూ. 10,000 కన్నా తక్కువ స్థాయికి దిగివచ్చాయి. ఇది కీలక స్థాయి. ఎందుకంటే అల్పాదాయ వర్గాలకూ ఇది అందుబాటు రేటుగానే భావించవచ్చు. ఇక దేశీయంగా విడిభాగాలు, చిప్‌ల తయారీ కోసం కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనివల్ల సరఫరాపరమైన ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ వ్యయాలు తగ్గి, మరింత అందుబాటు ధరల్లో లభించగలవు‘ అని చెప్పారు. కాబట్టి సబ్సిడీ అవసరం ఉండదనే అర్థం వచ్చేట్టుగా మంత్రి వ్యాఖ్యానించారు.

స్పెక్ట్రం ధరలపై కొనసాగుతున్న చర్చలు 
టెలికం స్పెక్ట్రం ధరకు సంబంధించిన చర్చల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. వీటిలో చురుగ్గా పాల్గొనాలని, టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్‌)కి తగు సూచనలివ్వాలని టెల్కోలకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన భాగస్వామ్య సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ట్రాయ్‌ తుది డాక్యుమెంటు రూపొందిస్తుందని, దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. స్పెక్ట్రం ధరల నిర్ణయంలో ’ప్రజా ప్రయోజనాల’ను కూడా దృష్టిలో ఉంచుకుంటున్న విషయాన్ని అంతా గుర్తిస్తున్నారని వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం.. అదే సమయంలో బడుగు వర్గాలకు సర్వీసులను మరింతగా మెరుగుపర్చడానికి మధ్య సమతూకం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కోవిడ్‌ పరిణామాలతో అంతా డిజిటల్‌ బాట పట్టాల్సి రావడంతో టెలికం ప్రాధాన్యతకు గణనీయంగా గుర్తింపు లభించిందని వైష్ణవ్‌ తెలిపారు.  
 

చదవండి: స్పెక్ట్రం బేస్‌ ధరపై టెలికాం సంస్థల పేచీ

మరిన్ని వార్తలు