చమురు ధరలు: ప్రత్యామ్నాయాలపై భారత్‌ చూపు! 

25 Jun, 2021 08:59 IST|Sakshi

చమురు ధరలపై తగ్గించాలి

పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్యతో చర్చ

ఇందుకు చర్యలు తీసుకోవాలని  ఒపెక్‌పై భారత్‌ ఒత్తిడి

న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు ‘భరించగలిగే స్థాయిలో’ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఒపెక్‌ను (పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య– ఓపీఈసీ) భారత్‌ డిమాండ్‌ చేసింది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశీయంగా రిటైల్‌ ఇంధన ధరలు రికార్డు గరిష్టాలకు చేరిన నేపథ్యంలో గురువారం భారత్‌ ఈ కీలక పిలుపునిచ్చింది. చమురు ధరలను ‘తగిన సమంజసమైన శ్రేణిలో’ ఉండేలా తక్షణ చర్యలు అవసరమని సూచించింది. ప్రత్యేకించి ఉత్పత్తి కోతల విధానానికి ముగింపు పలకాలని స్పష్టం చేసింది. సౌదీ అరేబియాసహా పలు ఒపెక్‌ దేశాలు భారత్‌ ప్రధాన చమురు వనరుగా ఉన్న సంగతి తెలిసిందే.  

ఒపెక్‌ సెక్రటరీ జనరల్‌తో చర్చలు 
ఒపెక్‌ సెక్రటరీ జనరల్‌ మహమ్మద్‌ సనౌసి బర్కిం దోతో భారత్‌ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చమురు ధరల విషయమై వర్చువల్‌గా చర్చలు జరిపారు. 2019 ఏప్రిల్‌ తరువాత మొదటిసారి అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు బేరల్‌కు 75 డాలర్లపైకి ఎగసిన సంగతి తెలిసిందే. దీనికితోడు దేశీయంగా సుంకాలతో భారత్‌లోని పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్, డీజిల్‌ ధర దాదాపు రూ.100 స్థాయికి చేరింది.  ఈ నేపథ్యంలో తగిన స్థాయిలో అంతర్జాతీయంగా ధర ఉండాలని భారత్‌ కోరినట్లు ఒక ప్రకటనలో ఒపెక్‌ తెలిపింది. అనంతరం చమురు మంత్రిత్వశాఖ కూడా ఒక ప్రకటన చేస్తూ, ‘‘క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వినియోగదారులు అలాగే ఎకానమీ రికవరీపై చూపుతున్న ప్రభావాన్ని చర్చించారు. భారత్‌లో తీవ్ర ద్రవ్యోల్బణానికి పరిస్థితులు దారితీస్తున్నాయని వివరించారు’’ అని పేర్కొంది. ఇరు వర్గాల ప్రకటనల ప్రకారం, చమురు మార్కెట్‌ పరిణామాలు చర్చల్లో చోటుచేసుకున్నాయి. ఆయిల్‌ డిమాండ్‌ రికవరీ, ఎకానమీ వృద్ధిపై ప్రభావం, ఇంధన సవాళ్లను అధిగమంచడం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. చదవండిఅదిరిపోయే ఫీచర్స్‌, త్వరలో మెక్రోసాఫ్ట్‌ విండోస్‌ 11 విడుదల

ప్రధాన్‌  కృతజ్ఞతలు.. 
భారత్‌లో మహమ్మారి రెండవ వేవ్‌ సమయంలో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌సహా పలు ఒపెక్‌ సభ్య దేశాలు చేసిన సహాయం పట్ల ప్రధాన్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒపెక్‌ సెక్రటేరియట్‌ నిరంతర సంప్రతింపుల కార్యక్రమంలో భాగంగా తాజా వీడియోకాన్ఫరెన్స్‌ జరి గింది. ప్రపంచ ఎకానమీ 5.5 శాతం పురోగమిస్తుందని, 2021లో రోజూవారీ ఆయిల్‌ డిమాండ్‌ 6 మిలియన్‌ బేరళ్లకుపైగా పెరుగుతుందని జూన్‌లో ఒపెక్‌ నెలవారీ ఆయిల్‌ మార్కెట్‌ నివేదిక పేర్కొంది.  

ప్రత్యామ్నాయాలపై భారత్‌ చూపు! 
సరఫరాల కోతలకు ముగింపు పలకాలని భారత్‌ పలు నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, ఒపెక్‌ దాని అనుబంధ దేశాలు (ఒపెక్‌ ప్లస్‌) పట్టించుకోవడం లేదు. దీనితో ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా భారత్‌ తన చమురు అవసరాలకు ప్రత్యామ్నాయ దేశాలపై  దృష్టి సారిస్తోంది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ చమురు దిగుమతుల్లో ఒపెక్‌ వాటా మేలో 60 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో ఇది ఏకంగా 74 శాతంగా ఉండడం గమనార్హం. 

నిజానికి చమురు ధరల విషయంలో  ఈ ఏడాది మార్చిలో భారత్‌–ఒపెక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  డిమాండ్‌ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరగాయి. ఈ నేపథ్యంలో చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఇందుకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాలపై  నియంత్రణలను సడలించాలని భారత్‌ అప్పట్లో విజ్ఞప్తి చేసింది.  ఈ విజ్ఞప్తిని  ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. పైగా ఒపెక్‌ సమావేశం అనంతరం మార్చి 4వ తేదీన సౌదీ అరేబియా భారత్‌కు ఒక ఉచిత సలహా ఇస్తూ, కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సూచించింది.  

2020 ఏప్రిల్‌–మే మధ్యన భారత్‌ 16.71 మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాట క)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. ఒపెక్‌ చేసిన ప్రకటనపై అప్పట్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తీవ్రంగా స్పందించారు. చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో కరోనా వైరస్‌పరమైన కారణాలతో డిమాండ్‌ పడిపోయి, ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్‌ కూటమి నిర్ణయించుకున్నప్పుడు తాము కూడా మద్దతునిచ్చామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్‌ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్‌ అప్పట్లో హామీ ఇచ్చిందని .. కానీ ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతున్నా ఉత్పత్తి మాత్రం సాధారణ స్థితికి రావడం లేదని ప్రధాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగిపోతే రేట్లు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

 క్రూడ్‌ ఆయిల్‌ను ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్‌ కొనుగోలు చేస్తుందని కూడా ప్రధాన్‌ స్పష్టం చేయడం గమనార్హం. ఉత్పత్తి, సరఫరాల విషయంలో నియంత్రణలు లేకుండా చూస్తూ, తక్కువ ధరకు చమురు సరఫరా చేయాలన్న భారత్‌ విజ్ఞప్తి పట్ల సౌదీ అరేబియా సమాధానం ‘దౌత్యధోరణి’ కాని రీతిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. భారత్‌ చమురు వినియోగంపై సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్‌ అబ్దుల్లాజిజ్‌ బిన్‌ సల్మాన్‌ చేసిన ప్రకటనను ‘‘సన్నిహితమైన స్నేహితుని’’  నుంచి  ‘‘దౌత్యరీతిలేని సమాధానం’’ అని ప్రధాన్‌ అభివర్ణించారు. ఇలాంటి వైఖరిని భారత్‌ అసలు అంగీకరించబోదని అన్నారు. భారత్‌ వ్యూహాత్మక చమురు నిల్వలను ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలన్నది భారత్‌ నిర్ణయమని పేర్కొన్నారు.

 తాజా పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకన్నా, అమెరికాకే భారత్‌ ప్రాధాన్యత ఇస్తోందా? అన్న అంశంపై ప్రధాన్‌ సమాధానం ఇస్తూ,  ‘‘మేము ఎవరికి దగ్గర అవుతున్నామన్న అంశం ఇక్కడ ప్రధానం కాదు. భారత్‌ ప్రయోజనాల పరిరక్షణ ఎలా అన్నదే ఇక్కడ ముఖ్యం. మాది బహిరంగ, స్వేచ్ఛాయుత మార్కెట్‌. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు దిగుమతిచేసుకునే అవకాశం మా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, ప్రైవేటు రంగం చమురు దిగ్గజ సంస్థలకు ఉంది. తక్కువ ధరకు చమురు లభ్యత మాకు ముఖ్యం. అది అమెరికానా లేక ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియానా అన్నది ప్రధానం కాదు.’’ అని అన్నారు.  భారత్‌లో రిఫైనర్స్‌ ఇప్పటికే తమ చమురు అవసరాలకు పశ్చిమ ఆసియావైపుకాకుండా తక్కువ ధరకు లభించే ఇతర దేశాల వైపూ దృష్టి పెడుతుండడం కీలకాంశం. 
 

మరిన్ని వార్తలు