ఈలాన్‌మస్క్‌కి మద్దతు పలికి కేంద్ర మంత్రి!

11 May, 2022 15:57 IST|Sakshi

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఈలాన్‌మస్క్‌తో అంటీముట్టనట్టుగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఓ కేంద్ర మంత్రి నుంచి ఈలాన్‌ మస్క్‌కి పరోక్ష మద్దతు లభించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ట్విటర్‌ విషయంలో ఈలాన్‌ మస్క్‌ తెలిపిన అభిప్రాయాలను కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సమర్థించారు.

ట్విటర్‌లో విద్వేషపూరిత ట్వీట్లు చేస్తున్నారని, అనవసర గొడవలకు కారణం అవుతున్నాడంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని తమ ప్లాట్‌ఫారమ్‌ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్టు గతంలో ట్విటర్‌ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అప్పుడే వ్యతిరేకించాడు ప్రపంచ కుబేరుడు ఈలాన్‌ మస్క్‌. ఫ్రీ స్పీచ్‌కి అవకాశం ఉండాలనే నినాదంతో ట్విటర్‌లోనూ పోల్స్‌ పెడుతూ చివరకు ఆ సంస్థను టేకోవర్‌ చేశారు. కాగా ట్రంప్‌పై శాశ్వత నిషేధం అనైతికంగా సరికాదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా చేయడం తమ వైఫలమ్యంటూ ట్విటర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్సే తనతో చెప్పినట్టు కూడా మస్క్‌ తెలిపాడు.

కాగా ట్రంప్‌ను ట్విటర్‌ నుంచి శాశ్వతంగా నిషేధించడం తమ వైఫల్యమంటూ జాక్‌ డోర్సే తెలిపినట్టుగా వచ్చిన వార్తా కథనాన్ని రీట్వీట్‌ చేస్తూ కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఒక ప్లాట్‌ఫామ్‌ నుంచి ఒక వ్యక్తిని శాశ్వతంగా నిషేధించడం అంటే యూజర్ల ప్రాథమిక హక్కులను హరించినట్టే. ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే బలమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. 

ఫ్రీ స్పీచ్‌, శాశ్వత నిషేధం వంటి అంశాలపై ఇప్పటికే ఈలాన్‌ మస్క్‌కి రోజురోజుకి ఆదరణ పెరుగుతుండగా తాజాగా భారత మంత్రి కూడా ఇందులో జతయ్యారు. పైగా మంత్రి ట్వీట్‌కు స్పందిస్తున్నవారు సైతం శాశ్వత నిషేధం అనే నిర్ణయం సరికాదంటున్నారు. 

చదవండి: Donald Trump: ట్విటర్‌ అలా చేయకుండా ఉండాల్సింది - ఈలాన్‌ మస్క్‌

మరిన్ని వార్తలు