చిప్‌ మేకర్స్‌కు కేంద్రం బంపర్‌ ఆఫర్

1 Apr, 2021 12:57 IST|Sakshi

స్వదేశీ చిప్‌ కోసం కేంద్రం భారీ నగదు ప్రోత్సాహకాలు

రూ. 7వేల కోట్ల వరకు నగదు ప్రయోజనం 

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో సెమీ కండక్టర్‌ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే ప్రతి కంపెనీకి కేంద్రం ఓ ఆఫర్‌ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ఈ నగదు ప్రోత్సాహాన్నిఇవ్వనున్నట్లు తెలిపింది. చైనా తర్వాత భారతదేశాన్ని రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారునిగా అంతర్జాతీయ మార్కెట్‌లో నిలబెట్టడానికి ఇది సహాయ పడుతుందని కేంద్రం భావిస్తోంది.

"చిప్ ఫాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రభుత్వం 1 బిలియన్ డాలర్లకు ( సుమారు 7వేల కోట్ల రూపాయలు)  పైగా నగదు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మీడియాతో అన్నారు. అంతేకాక కంపెనీలు తయారు చేసే చిప్ల‌ను ప్రభుత్వమే కొనుగోలు కూడా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ నగదు ప్రోత్సాహకాలను ఎలా పంపిణీ చేయాలో ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆటో,ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో చిప్స్‌‌ కొరత కారణంగా ప్రపంచం వాటి కోసం తైవాన్‌పై ఆధారపడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రభుత్వాలు సెమీకండక్టర్ ప్లాంట్ల నిర్మాణానికి సబ్సిడీలు, రాయితీలు ఇస్తున్నాయి.

ఇప్పటి వరకు భారత్‌ ఎలక్ట్రానిక్స్, టెలికాం పరిశ్రమకు కావాల్సిన వస్తువుల కోసం చైనా వైపే చూస్తోంది. గత ఏడాది సరిహద్దు ఘర్షణ తరువాత భవిషత్తుల్లో డ్రాగన్‌ దేశంపై ఆధారపడటం తగ్గించే  దిశగా  కేంద్రం అడుగులు వేస్తోంది.  ఈ నేపథ్యంలోనే స్వదేశీ చిప్‌లు, సీసీటీవీ కెమెరాల నుంచి 5 జీ పరికరాల ఉత్పత్తుల్లో ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కాకపోతే  సెమీకండక్టర్ తయారీ కంపెనీలు తమ యూనిట్లను భారతదేశంలో ఏర్పాటుకు ఆసక్తి చూపించాయో లేదో ఆ ఆధికారులు ఏ సమాచారం ఇవ్వలేదు.

( చదవండి: ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్‌ తీపి కబురు )

మరిన్ని వార్తలు