పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఆదాయం ఎంతనో తెలుసా..!

21 Dec, 2021 18:46 IST|Sakshi

గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు, సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.4,55,069 కోట్లు వసూలు చేసినట్లు పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. ఇదే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం రూ.2,02,937 కోట్లు అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను(వ్యాట్)గా వసూలు చేసినట్లు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి తెలియజేశారు. రాష్ట్రాల్లో మహారాష్ట్ర అన్ని పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకపు పన్ను, వ్యాట్ రూపంలో గరిష్టంగా 25,430 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రూ.21,956 కోట్లు, తమిళనాడు రూ.17,063 కోట్లు వసూలు చేశాయి.

నవంబర్ 3న పెట్రోల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించినప్పటికీ దేశంలో పెట్రోల్ & డీజిల్ ధరలు ఇంకా ఆకాశాన్ని తాకుతున్నాయి. కేంద్రం ప్రకటన తర్వాత అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై వ్యాట్‌ను కూడా తగ్గించాయి. ప్రస్తుతం దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.88.67గా ఉంది. భారతదేశం తన చమురు డిమాండ్‌లో 85 శాతం, 55 శాతం సహజ వాయువు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉంది. భారతదేశం 2020-21లో ముడి చమురు దిగుమతుల కోసం 62.71 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

(చదవండి: డిస్నీ+ హాట్‌స్టార్‌ అదిరిపోయే ప్లాన్‌..! కేవలం రూ. 49 కే సబ్‌స్క్రిప్షన్‌..!)

మరిన్ని వార్తలు