ప్రభుత్వ హౌజింగ్‌ కాలనీలు ఖాళీ చేయండి: కేంద్రం ఆదేశాలు.. ఎయిర్‌ ఇండియా ఉత్తర్వులు

24 May, 2022 08:56 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యాపార రంగంలో నిజాయితీ, నీతి, విలువలకు మారుపేరని టాటా గ్రూప్‌పై జనాల్లో ఓ పేరుంది. అందుకు తగ్గట్లే ఆ కంపెనీ వ్యవహరిస్తుంటుంది కూడా. కిందటి ఏడాది ఎయిర్‌ ఇండియాను జేక్కించుకున్న టాటా గ్రూప్‌.. ఈమధ్యే పని చేసే చోట ఉద్యోగుల ధూమపానం, మద్యపానంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  ఇప్పుడు ఉద్యోగుల కోసం మరో కీలక ప్రకటన చేసింది. 

ప్రభుత్వ సంబంధిత హౌజింగ్‌ కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులు.. ఖాళీ చేయాలంటూ కోరింది టాటా గ్రూప్‌ ఎయిర్‌ ఇండియా. ఇందుకోసం జులై 26వ తేదీ దాకా గడువు ఇచ్చింది. అలా చేయడంలో విఫలమైతే ఉద్యోగులు పెనాల్టీ, డ్యామేజ్ ఛార్జీలు చెల్లించడంతోపాటు రిటైర్మెంట్.. ఇతర ఉద్యోగ ప్రయోజనాలను కోల్పోతారని ఎయిర్ ఇండియా హెచ్చరించింది. ఈ మేరకు మే 18వ తేదీనే ఆదేశాలు జారీ చేసింది.

ఎయిర్‌ ఇండియా స్పెసిఫిక్‌ అల్టర్‌నేటివ్‌ మెకానిజం (AISAM).. నిర్ణయానికి అనుగుణంగానే ఈ చర్యకు ఉపక్రమించింది ఎయిర్‌ ఇండియా అస్సెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ (AIAHL). ఎయిర్‌ ఇండియా బిడ్‌ను టాటా గ్రూప్‌.. కిందటి ఏడాది అక్టోబర్‌ 8వ తేదీన గెల్చుకుంది. అయితే పెట్టుబడుల ఉపసంహరణ నిబంధనల ప్రకారం.. హౌసింగ్ కాలనీలు వంటి ఎయిర్‌లైన్ నాన్-కోర్ ఆస్తులు మాత్రం ప్రభుత్వం వద్దే ఉంటాయి.

ఇదిలా ఉంటే.. ఎయిర్‌ ఇండియాకు ఢిల్లీ, ముంబైలో హౌజింగ్‌ కాలనీలు ఉన్నాయి. 1,800 మందికి పైగా ఉ‍ద్యోగులు అందులో నివాసం ఉంటున్నారు. వీళ్లంతా కేంద్రం చర్యను వ్యతిరేకిస్తూ.. కోర్టును ఆశ్రయించాలనుకుంటున్నారు.  ఎయిర్‌ ఇండియా అస్సెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ 2019లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఎయిర్‌ ఇండియా స్పెసిఫిక్‌ అల్టర్‌నేటివ్‌ మెకానిజంను కేంద్ర మంత్రుల బృందం పర్యవేక్షిస్తుంది. హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంతత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. ఈ వ్యవహారాలను చూస్తున్నారు.

మరిన్ని వార్తలు