తగ్గనున్న పామాయిల్‌ ధర.. మరి మిగితావో ?

30 Jun, 2021 10:12 IST|Sakshi

పామాయిల్‌ దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

15 నుంచి 10 శాతానికి  బేస్‌ట్యాక్స్‌ తగ్గింపు

హోటళ్లు, రెస్టారెంట్లకు కొంతమేర ఊరట

సోయా, సన్‌ఫ్లవర్‌ ధరలపై స్పందించని కేంద్రం 

హైదరాబాద్‌ : భగ్గుమంటున్న పెట్రోల్‌ డీజిల్‌ ధరలు, మండిపోతున్న వంట నూనె ధరలు.... ఇలా పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులకు ఊరట కలిగించే చర్య తీసుకుంది కేంద్రం. వంటలో ఉపయోగించే పామాయిల్‌ దిగుమతిపై సుంకాన్ని తగ్గించింది. 

మూడు నెలల పాటు
ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్‌ దిగుమతి చేసుకునేది మన దేశమే. ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి ఏటా 8,50,000 టన్నుల పామ్‌ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతిపై మన ప్రభుత్వం 15 శాతం వరకు బేస్‌ ట్యాక్స్‌ విధిస్తోంది. పెరిగిన ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు పామాయిల్‌ దిగుమతులపై ఉన్న బేస్‌ ట్యాక్స్‌ 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మూడు నెలల పాటు ఈ పన్ను తగ్గింపు నిర్ణయం అమల్లో ఉంటుంది. పన్ను తగ్గించడం వల్ల అదనంగా 50,000 టన్నుల పామాయిల్‌ దిగుమతులు పెరగవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. ఫలితంగా పామాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 

మిగిలిన వాటి సంగతో
సాధారణంగా పామాయిల్‌ని ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న రకరకాల పన్నుల మొత్తం 35 శాతం ఉండగా దాన్ని 30 శాతం తగ్గించింది. కానీ గృహ అవసరాలకు ఎక్కువగా వినియోగించే సోయా, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లపై దిగుమతి పన్ను తగ్గించకలేదు. దీంతో వాటి ధరలు ఇప్పట్లో తగ్గేది కష్టమే. పామాయిల్‌ దిగుమతి సుంకం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం కంటి తుడుపు చర్య అవుతుందే తప్ప సామాన్యులకు దీని వల్ల ఒరిగేది లేదని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.  

చదవండి : NITI Aayog: పన్ను మినహాయింపులకు నీతి ఆయోగ్‌ ఓటు

మరిన్ని వార్తలు