బీపీసీఎల్‌ 'ఫర్‌ సేల్‌' ..కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

9 Aug, 2022 06:55 IST|Sakshi

నిర్ణీత సమయంలో పరిస్థితిని సమీక్షించిన తర్వాత భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) వాటా విక్రయ ప్రక్రియను తిరిగి ప్రారంభించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కరాద్‌ లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్‌ మహమ్మారి, ఇంధన ధరల అనిశ్చితి,  భౌగోళిక–రాజకీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలను ప్రభావితం చేశాయని మంత్రి పేర్కొంటూ, ఇందులో చమురు,  గ్యాస్‌ పరిశ్రమ ప్రధానమైనదని తెలిపారు.

ఆ పరిస్థితుల ప్రభావంతోనే బీపీసీఎల్‌ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ (మెజారిటీ వాటా) కోసం ప్రస్తుత ఈఓఐ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) ప్రక్రియను నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బీపీసీఎల్‌లో 52.98 శాతం వాటాలను విక్రయించడానికి సంబంధించిన ఆఫర్‌ను ప్రభుత్వం మేలో ఉపసంహరించింది. 

బీపీసీఎల్‌ వ్యూహాత్మక వాటా విక్రయానికి 2020లో బిడ్డర్ల నుంచి ఈఓఐలను ఆహ్వానించడం జరిగింది. 2020 నవంబర్‌ నాటికి మూడు బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇంధన ధరలపై అస్పష్టత తత్సంబంధ అంశాల నేపథ్యంలో తదనంతరం ఇరువురు బిడ్స్‌ ఉపసంహరించుకున్నారు. దీనితో మొత్తం బిడ్డింగ్‌ పక్రియను కేంద్రం వెనక్కు తీసుకుంది. అప్పట్లో బిడ్స్‌ వేసిన సంస్థల్లో మైనింగ్‌ దిగ్గజం అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్, యుఎస్‌ వెంచర్‌ ఫండ్స్‌ అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ ఇంక్,  ఐ స్క్వేర్డ్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ ఉన్నాయి.  

మరిన్ని వార్తలు