చెక్‌ బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారం ఎలా?

4 Mar, 2021 06:02 IST|Sakshi

కమిటీ ఏర్పాటుకు సుప్రీం సూచన

24 గంటల్లో  పేర్లు సిఫారసు చేయాలని కేంద్రానికి ఆదేశం  

న్యూఢిల్లీ: కోర్టుల్లో భారీగా పేరుకుపోయిన చెక్‌బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారం ఎలా అన్న అంశంపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు, ఈ అంశంపై సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును బుధవారం ప్రతిపాదించింది. కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి వివిధ శాఖల సభ్యులు, సెక్రటరీలు, అధికారుల పేర్లను గురువారంనాటికి తెలియజేయాలని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఎల్‌ నాగేశ్వర రావు, ఆర్‌. రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ విక్రమ్‌జిత్‌ బెనర్జీని ఆదేశించింది. వివిధ మంత్రిత్వశాఖల సెక్రటరీలు, అధికారులు, సంబంధిత వర్గాలతో చెక్‌బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కార అంశంపై చర్చించాల్సి ఉందని  అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనం ముందు పేర్కొనడంతో, అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది.  

35 లక్షల పెండింగ్‌ కేసులు...
నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ (ఎన్‌ఐ యాక్ట్‌) కేసులను సత్వరం పరిష్కరించడానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలియజేయాలని ఫిబ్రవరి 25వ తేదీన సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసు తిరిగి బుధవారం ధర్మాసనం ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 35 లక్షల ఎన్‌ఐ యాక్ట్‌ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్‌ కేసుల్లో 15 శాతం పైగా) పెండింగులో ఉన్న నేపథ్యంలో ధర్మాసనం ఈ అంశంపై దృష్టి పెట్టింది.  247వ అధికరణ కింద  (అదనపు కోర్టుల ఏర్పాటుకు పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తున్న అధికరణం) ఎన్‌ఐ యాక్ట్‌ కేసుల సత్వర పరిష్కారానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై కేంద్రం అభిప్రాయాన్ని వారం రోజుల్లో  తెలియజేయాలని ధర్మాసనం గత నెల 25న అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ విక్రమ్‌జిత్‌ బెనర్జీని ఆదేశించింది. చెక్‌బౌన్స్‌లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యం లో సుప్రీంకోర్టు సూ మోటోగా (తనకు తానుగా) ఈ కేసు గత ఏడాది విచారణకు చేపట్టింది.  2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య (కోర్టుల్లో చెక్‌ బౌన్స్‌ కేసుల దీర్ఘకాలిక విచారణ అంశం)  అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్‌ అడ్వకేట్‌ సిద్ధార్థ్‌ లుథ్రా, అడ్వకేట్‌ కే. పరమేశ్వర్‌లు నియమితులయ్యారు.

>
మరిన్ని వార్తలు