చార్జింగ్‌ స్టేషన్లకు రూ.800 కోట్లు

29 Mar, 2023 01:28 IST|Sakshi

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగంలోని మూడు చమురు కంపెనీలకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్టు భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఫేమ్‌ ఇండియా స్కీమ్‌ ఫేజ్‌–2 కింద ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియన్‌ ఆయిల్, భారత్‌ పెట్రోలియం, హిందుస్తాన్‌ పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా ఫిల్లింగ్‌ సెంటర్లలో 7,432 చార్జింగ్‌ కేంద్రాలను 2024 మార్చి నాటికి ఏర్పాటు చేస్తాయి.

ఈ స్టేషన్స్‌లో ద్విచక్ర వాహనాలు, ఫోర్‌ వీలర్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న బస్‌లకు చార్జింగ్‌ సౌకర్యాలు ఉంటాయి. ఈ మూడు కంపెనీలకు తొలి విడతగా రూ.560 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,586 చార్జింగ్‌ స్టేషన్స్‌ ఉన్నాయి. కొత్తగా జోడించనున్న కేంద్రాలతో ఎలక్ట్రిక్‌ వాహన రంగానికి మంచి బూస్ట్‌నిస్తుందని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు