కెయిర్న్‌ వివాద పరిష్కారంపై కేంద్రం దృష్టి

23 Apr, 2021 01:50 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్రిటన్‌ ఇంధన దిగ్గజం కెయిర్న్‌తో పన్ను వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మెరుగైన మార్గాలన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.  దీనికి సంబంధించి ట్యాక్సేషన్‌ విషయంలో భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా, కెయిర్న్‌కు అనుకూలంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు ఇవ్వడం తప్పు ధోరణులకు దారి తీసే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

భారత విభాగాన్ని గతంలో పునర్‌వ్యవస్థీకరణ చేసిన కెయిర్న్‌ దాదాపు రూ. 10,247 కోట్ల మేర పన్నులు, వడ్డీ కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసులివ్వడం, కంపెనీకి చెందాల్సిన డివిడెండ్లను.. ట్యాక్స్‌ రీఫండ్‌లను జప్తు చేసుకోవడం తెలిసిందే. దీనిపై కెయిర్న్‌ వివిధ న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు భారత ప్రభుత్వం 1.725 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 12,600 కోట్లు) చెల్లించాలంటూ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని భారత ప్రభుత్వం సవాలు చేసింది.

రికవరీ బాటన పరిశ్రమ: పారిశ్రామిక రంగం రికవరీ బాటన పయనిస్తోందని ఆర్థికమంత్రి ఫైనాన్షియల్‌ టైమ్స్, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన ఒక వెబినార్‌లో పేర్కొన్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ సవాళ్ల నేపథ్యంలోనూ పెట్టుబడి ఉపసంహరణసహా బడ్జెట్‌ ప్రతిపాదనలు అన్నింటినీ అమలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు