ప్రైవేటీకరణలో బీపీసీఎల్‌, కేంద్రం కీలక నిర్ణయం!

17 May, 2022 21:44 IST|Sakshi

పెట్టుబడి దారుల్ని ఆకర్షించడంలో భారత్‌ పెట్రోలియం కార్ప్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)విఫలమైంది. అందుకే భారత్‌ పెట్రోలియంలో పావు భాగాన్ని అమ్మేందుకే కేంద్రం మొగ్గుచూపుతుందంటూ  కేంద్రానికి చెందిన ఇద్దరు కీలక అధికారులు చెప్పారంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చాయి. 

కేంద్రం బీపీసీఎల్‌ మొత్తం 52.98శాతం వాటా అమ్మాలని భావించింది. బిడ్‌లను ఆహ్వానించింది. అయితే ఈ బిడ్‌లలో ఊహించిన దానికంటే ధర తక్కువ పలికింది. దీంతో కేంద్రం ముందస్తు అమ్మాలనుకున్న వాటా కంటే 20శాతం నుంచి 25శాతం వాటా అమ్మే ప్రక్రియను కేంద్రం పరిశిలిస్తోందని పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ఇద్దరు ప్రభుత్వ అధికారులు రాయిటర్స్‌తో చెప్పారు.

నత్తనడకనే.. 
బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి సంబంధించి పెద్దగా పురోగతి లేదని అధికార వర్గాలు అంటున్నాయి.చాలా వరకు బిడ్డర్లు ఈ డీల్‌కు సరిపడా నిధులను సమకూర్చుకునేందుకు తగిన భాగస్వాములను ఎంపిక చేసుకోలేకపోయినట్టు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత వాతావరణానికి తోడు.. ఇంధన మార్కెట్లలోని ఆటుపోట్లను కారణంగా పేర్కొంటున్నాయి. పైగా విక్రయానికి సంబంధించి ఎన్నో అంశాలపై సందేహాల నివృత్తికి సమయం పట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆసక్తి కలిగిన బిడ్డర్లు బీపీసీఎల్‌కు సంబంధించి ఆర్థిక డేటాను గతేడాది ఏప్రిల్‌లనే పొందినట్టు వెల్లడించాయి. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఆయా అంశాలపై చర్చలకు చాలా సమయం పట్టినట్టు వివరించాయి. 

కరోనా రాక ముందు వరకు అంటే 2020 ఫిబ్రవరి నాటికి బీపీసీఎల్‌ను ఎయిర్‌ ఇండియా కంటే ముందే విక్రయించగలమన్న నమ్మకంతో ప్రభుత్వం ఉంది. ఎయిర్‌ఇండియా తీవ్ర నష్టాల్లో నడుస్తుంటే.. బీపీసీఎల్‌ లాభాల వర్షం కురిపిస్తున్న కంపెనీ కావడం గమనార్హం. దీంతో అంతర్జాతీయగా దిగ్గజ ఇంధనరంగ కంపెనీలకు అదిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుకూల మార్గం అవుతుందని అభిప్రాయపడింది. కానీ కరోనా రాకతో అవన్నీ తారుమారయ్యాయి. అధిక వ్యయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున.. ఒకవైపు పన్నుల రూపంలో ఆదాయం పెరిగినా కానీ, పెట్టుబడుల ఉపంసంహరణ రూపంలో ఆదాయానికి తొర్ర పడితే జీడీపీలో ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం 6.8 శాతాన్ని ఎలా అధిగమించగలదో చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు