ఎగుమతుల రంగానికి ఊతం ఇస్తూ కేంద్రం కీలక నిర్ణయం..!

18 Aug, 2021 09:11 IST|Sakshi

ఎగుమతులకు కేంద్రం బూస్ట్‌ 

పన్ను రిఫండ్‌ పథకానికి రూ.12,454 కోట్ల కేటాయింపు  

న్యూఢిల్లీ: ఎగుమతుల రంగానికి ఊతం ఇస్తూ, మంగళవారం కేంద్రం (ఆర్‌ఓడీటీఈపీ – రెమిషన్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ అండ్‌ ట్యాక్సెస్‌ ఆన్‌ ఎక్స్‌పోర్టెడ్‌ ప్రొడక్ట్స్‌) పన్ను, సుంకాల రిఫండ్‌ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రూ.12,454 కోట్లు కేటాయించింది. 8,555 ఉత్పత్తులకు వర్తించే విధంగా ఆర్‌ఓడీటీఈపీకి ఈ నిధులను కేటాయించింది. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై విధించిన సుంకాలు, పన్నుల రిఫండ్‌కు ఉద్ధేశించిన ఈ పథకం కింద పన్ను రిఫండ్‌ రేట్లను కూడా  కేంద్రం నోటిఫై చేసింది.

వివిధ రంగాలకు సంబంధించి పన్ను రిఫండ్‌ రేట్లు 0.5 శాతం నుంచి 4.3 శాతం శ్రేణిలో ఉన్నాయి. విద్యుత్‌ చార్జీలపై సుంకాలు, రవాణా ఇంధనంపై వ్యాట్, వ్యవసాయం, సొంత అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉత్పత్తి, మండీ ట్యాక్స్, స్టాంప్‌ డ్యూటీ, ఇంధనంపై సెంట్రల్‌ ఎక్సైజ్‌పన్ను వంటి విభాగాల్లో  రిఫండ్స్‌ జరుగుతాయి.  రిఫండ్‌ జరిగే 8,555 ఉత్పత్తుల్లో సముద్ర ప్రాంత ఉత్పత్తులు, దారం, డెయిరీ ప్రొడక్టులు, వ్యవసాయం, తోలు, రత్నాలు–ఆభరణాలు, ఆటోమొబైల్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ ఉన్నాయి. ఈ పథకం కింద వివిధ ప్రొడక్టులపై విధించిన వివిధ కేంద్ర, రాష్ట్ర సుంకాలు, పన్నులు, లెవీలను ఎగుమతిదారులకు రిఫండ్‌ జరుగుతుంది.  (చదవండి: Apple: ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..!)

రెండు కీలక పథకాలకు రూ.19,400 కోట్లు 
ఆర్‌ఓడీటీఈపీతోపాటు, ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌ (రిబేట్‌ ఆఫ్‌ స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ ట్యాక్సెస్‌ అండ్‌ లెవీస్‌) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.19,400 కోట్లు అందుబాటులో ఉంటాయని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రమణ్యం తెలిపారు. వస్త్రాలు, దుస్తుల ఎగుమతులపై రాయితీలకు సంబంధించిన ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌ పథకాన్ని కేంద్రం  ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం కేటాయించిన రూ.19,400 కోట్ల నిధుల్లో రూ.12,454 కోట్లు ఆర్‌ఓడీటీఈపీకి ఉద్దేశించినదికాగా, మిగిలిన రూ. 6,946 కోట్లు ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌కు కేటాయించినది. ఆర్‌ఓడీటీఈపీ స్కీమ్‌ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దాదాపు 95 శాతం వస్తువులు, ఎగుమతులకు ఈ రెండు పథకాలు వర్తిస్తాయని సుబ్రమణ్యం తెలిపారు. స్టీల్, రసాయనాలు, ఔషధ రంగాలకు మాత్రం ఆర్‌ఓడీటీఈపీ పథకం వర్తించదని ఆయన తెలిపారు.

ఎటువంటి ప్రోత్సాహకాలూ లేకుండా ఈ రంగాలు కార్యకలాపాలు నిర్వహించడమే దీనికి కారణమని ఆయన తెలిపారు. భారత్‌ ఎగుమతులుకు ఈ పథకాలు ప్రతిష్టాత్మకమైనవని, అంతర్జాతీయ పోటీలో భారత్‌ ఉత్పత్తులు నిలదొక్కుకోడానికి ఈ పథకాలు దోహదపడతాయని వివరించారు.  జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ  కేంద్రం ఇటీవలే ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌ స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్‌ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది.   

సానుకూల చర్య...
అంతర్జాతీయంగా ఈ రంగంలో పోటీని ఎదుర్కొనడానికి ఎగుమతిదారులకు తాజా నిర్ణయం దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) చైర్మన్‌ ఏ శక్తివేల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. ముఖ్యంగా బంగ్లాదేశ్, వియత్నాం, మియన్మార్, కాంబోడియా, శ్రీలంక వంటి దేశాల నుంచి పోటీని ఎగుమతిదారులు తట్టుకోగలుగుతారని వివరించారు.  స్థిరమైన పన్ను రేట్ల వల్ల ఈ రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని  వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరపాలన్న లక్ష్యంలో వేసిన తొలి అడుగుగా దీనిని అభివర్ణించారు. ఎగుమతుల పురోభివృద్ధికే కాకుండా ఈ రంగంలో స్టార్టప్స్‌ ఏర్పాటుకు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కూడా ఈ చర్య పరోక్షంగా దోహపడుతుందని విశ్లేషించారు.   

(చదవండి: ఐమాక్స్‌ వీడియో రికార్డింగ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ సొంతం...!)

మరిన్ని వార్తలు