ఒమిక్రాన్‌పై పోరులో సహకరించండి: ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం విజ్ఞప్తి

8 Jan, 2022 14:04 IST|Sakshi

బాధిత రంగాలకు మద్దతివ్వండిప్రభుత్వ రంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌సన్నద్ధతపై సమీక్ష

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వల్ల ప్రతికూల ప్రభావాలకు గురయ్యే రంగాలకు చేయూతను అందించాలని ప్రభుత్వ రంగం బ్యాంకులకు (పీఎస్‌బీ) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల సీఎండీలు, ఎండీలతో ఆమె శుక్రవారం వర్చువల్‌గా ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కోవిడ్‌–19 ప్రభావాలను ఎదుర్కొనడంలో వారి సన్నద్ధతను సమీక్షించారు. సవాళ్లను ఎదుర్కొనే వ్యవసాయం, రిటైల్, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు తగిన చేయూతను అందించాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. సమావేశానికి సంబంధించి ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 


   మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న వివిధ చొరవలను అమలు చేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకున్న వివిధ చర్యలను ఆర్థికమంత్రి సమీక్షించారు. అలాగే భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనడంలో సన్నద్ధత గురించి చర్చించారు.  

 అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీసీ) వల్ల ఒనగూరిన ప్రయోజనాలను ఆమె ప్రస్తావిస్తూ, అయితే ఈ విజయాలపై ఆధారపడి విశ్రాంతి తీసుకోవడానికి ఇంకా సమయం రాలేదని అన్నారు.  కోవిడ్‌–19 మహమ్మారి నిరంతర దాడి కారణంగా అంతరాయాన్ని ఎదుర్కొంటున్న రంగాలకు మద్దతిచ్చే దిశగా సమష్టి కృషి కొనసాగాలని పిలుపునిచ్చారు.  

 అంతర్జాతీయ ప్రతికూలతలు, ఒమిక్రాన్‌ వ్యాప్తి వంటి అంశాలు ఉన్నప్పటికీ దేశంలో వ్యాపార దృక్పథం క్రమంగా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.  

    రిటైల్‌ రంగంలో వృద్ధి, మొత్తం స్థూల ఆర్థిక అవకాశాల మెరుగుదల,  రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వంటి కారణాల నేపథ్యంలో రుణ  డిమాండ్‌ పెరుగుతుందని చెప్పారు.

 

 2021 అక్టోబర్‌లో ప్రారంభించిన క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.61,268 కోట్ల రుణ మంజూరీలు జరిపాయి. ఇక 2020 మేలో ప్రారంభించిన రూ. 4.5 లక్షల కోట్ల రుణ హామీ పథకం ద్వారా నవంబర్‌ 2021 నాటికి రూ.2.9 లక్షల కోట్ల (కేటాయింపు నిధుల మొత్తంలో 64.4 శాతం) మంజూరీలు జరిగాయి. ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈ రంగం ఈ పథకం వల్ల ప్రయోజనం పొందిందన్న గణాంకాలు వెలువడుతున్నాయి. ఈ పథకం వల్ల 13.5 లక్షల చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందాయని, రూ.1.8 లక్షల కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారకుండా రక్షణ పొందాయని, దాదాపు ఆరు కోట్ల మంది కుటుంబాలకు జీవనోపాధి లభించిందని ఆర్థికశాఖ పేర్కొంది.

ఈసీఎల్‌జీఎస్‌  వల్ల ఎకానమీకి భారీ ప్రయోజనాలు కలిగినట్లు బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరిశోధనా నివేదిక తెలిపింది. ఈ పథకం వల్ల దాదాపు 13.5 లక్షల సంస్థలు దివాలా చర్యల నుంచి రక్షణ పొందాయని, ఫలితంగా 1.5 కోట్ల మంది ఉద్యోగాలకు రక్షణ లభించిందని విశ్లేషించింది. ఒక్కొ క్కరి కుటుంబ సభ్యుల సంఖ్య నలుగురిగా భావిస్తే, ఆరు కోట్ల జీవిత అవసరాలకు రుణ హామీ పథకం రక్షణ కల్పించిం దని తెలిపింది. ఈ పథకం వల్ల లబ్ధి పొం దిన రాష్ట్రాల్లో తొలుత గుజరాత్‌ ఉంది.

మరిన్ని వార్తలు