అమ్మకానికి కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థ వాటా, కొనుగోలు రేసులో మేఘా ఇంజినీరింగ్‌!

30 Jun, 2022 08:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీఈఎంఎల్‌లో 26 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్‌), టాటా మోటర్స్, అశోక్‌ లేల్యాండ్, భారత్‌ ఫోర్జ్‌ తదితర సంస్థలు షార్ట్‌లిస్ట్‌ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా వాటితో పాటు ఈ నాలుగు సంస్థలు.. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) సమర్పించాయి. వీటికి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) డాక్యుమెంట్‌ను జారీ చేయడం సహా బీఈఎంఎల్‌ డేటా రూమ్, ఉత్పత్తి కేంద్రాలను సందర్శించేందుకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.

చైనా, పాకిస్తాన్‌తో వ్యాపార సంబంధాలేమైనా ఉంటే వెల్లడించాలంటూ కూడా ఆయా సంస్థలకు సూచించినట్లు పేర్కొన్నాయి. పృథ్వీ మిసైల్‌ లాంచర్‌ వంటి మిలిటరీ హార్డ్‌వేర్‌ను తయారు చేసే బీఈఎంఎల్‌ రక్షణ..ఏరోస్పేస్, మైనింగ్‌.. నిర్మాణం, రైల్‌..మెట్రో వంటి మూడు ప్రధాన విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల్లో తొమ్మిది ప్లాంట్‌లు ఉన్నాయి.  బీఈఎంఎల్‌లో కేంద్రానికి 54 శాతం వాటాలు ఉన్నాయి.

డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ఇందులో కొంత భాగాన్ని విక్రయించడంతో పాటు యాజమాన్య హక్కులను కూడా బదలాయించే ఉద్దేశ్యంతో జనవరి 4న ప్రభుత్వం ఈవోఐలను ఆహ్వానించింది. ఈవోఐలను సమర్పించేందుకు మార్చి 1 ఆఖరు తేదీగా ముందు ప్రకటించినా ఆ తర్వాత దాన్ని 22 వరకూ పొడిగించారు. నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ కొనుగోలుకు సంబంధించి కూడా షార్ట్‌లిస్ట్‌ అయిన సంస్థల్లో ఎంఈఐఎల్‌ ఉంది.
 

మరిన్ని వార్తలు