హిందుస్తాన్‌ జింక్‌ వాటా విక్రయాలపై...సీబీఐ విచారణకు లైన్‌ క్లియర్‌!

8 Feb, 2022 11:00 IST|Sakshi

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ జింక్‌  2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్‌) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)ను ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్‌18వ తేదీన ఇచ్చిన ఉపసంహరించుకోవాలని దాఖలు చేసిన రికాల్‌ పిటిషన్‌ను కేంద్రం సోమవారం ఉపసంహరించుకుంది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్‌ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. అవసరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు.  అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్,  సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విభేదించింది. పిటిషన్‌ను కొట్టివేస్తారన్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్‌ అంగీరిస్తూ, ‘డిస్‌మిస్డ్‌ విత్‌ విత్‌డ్రాన్‌’గా రూలింగ్‌ ఇచ్చింది.  

నేపథ్యం ఇదీ... 
గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్‌ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్‌ క్లియర్‌ చేసింది. అయితే హిందుస్తాన్‌ జింక్‌  2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్‌) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని  అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యాఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్‌ జింక్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్‌ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై  అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్‌ జింక్‌ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం వాటాలు ఇలా... 
ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్‌ (అనిల్‌ అగర్వాల్‌ నడుపుతున్న స్టెరిలైట్‌ ఆపర్చునిటీస్‌ అండ్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌) వద్ద హిందుస్తాన్‌ జింక్‌లో మెజారిటీ 64.92% వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5% వాటా ఉంది. ఎన్‌ఎస్‌ఈలో హిందుస్తాన్‌ జింక్‌ షేర్‌ 4% పైగా పెరిగి రూ.334 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు