కంపెనీల కొనుగోళ్లపై సీఈవోల దృష్టి 

26 May, 2022 11:31 IST|Sakshi

కోవిడ్‌తో వ్యాపారాలకు స్వల్పకాలిక అవాంతరాలు 

సవాళ్లను దీటుగా ఎదుర్కొంటున్న దేశీ సంస్థలు 

ఈవై ఇండియా సర్వే 

న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారితో దేశీయంగా వ్యాపారాలకు స్వల్పకాలిక అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే, ఎకానమీ పుంజుకునే కొద్దీ భారతీయ సంస్థలు ఆయా సవాళ్లను దీటుగా ఎదుర్కొనడం కొనసాగిస్తున్నాయి. ఈవై ఇండియా సీఈవో సర్వే 2022లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కార్యకలాపాలను విస్తరించుకోవడానికి సంబంధించి వ్యాపారాలను క్రమక్రమంగా నిర్మించుకుంటూ వెళ్లడం కన్నా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాలకే (ఎంఅండ్‌ఏ) ప్రాధాన్యం ఇవ్వాలని సీఈవోలు భావిస్తున్నారు.

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు, పెరుగుతున్న భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక సవాళ్ల మధ్య భారతీయ సీఈవోలు తమ రిస్కులను కొత్తగా మదింపు చేసుకుంటున్నారు. మారే పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు తమ పెట్టుబడుల వ్యూహాలను మార్చుకుంటున్నారు. సర్వే ప్రకారం మహమ్మారి వల్ల తమ వ్యాపారాలకు స్వల్పకాలికంగా అవాంతరాయాలు ఏర్పడ్డాయని 50 శాతం మంది భారతీయ సీఈవోలు వెల్లడించారు. భౌగోళికరాజకీయ సవాళ్లు దీనికి మరింత ఆజ్యం పోశాయని, వ్యాపార కార్యకలాపాలకు మరిన్ని రిస్కులు తెచ్చిపెట్టాయని వివరించారు. 

వ్యూహాల్లో మార్పులు .. 
సవాళ్లను అధిగమించేందుకు తమ అంతర్జాతీయ కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నట్లు 80 శాతం మంది సీఈవోలు తెలిపారు. లాజిస్టిక్స్‌ వ్యయాలను తగ్గించుకోవడం, సవాళ్లను దీటుగా ఎదుర్కొనడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు 63 శాతం మంది వివరించారు. ‘సాంప్రదాయేతర సంస్థల నుంచి పోటీతో పాటు భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, రక్షణాత్మక ధోరణులు పెరుగుతున్న అంశాన్ని భారతీయ సీఈవోలు గుర్తించారు‘ అని సర్వే వివరించింది.

మహమ్మారి, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల వల్ల వస్తున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భారతీయ సీఈవోలు ముందుండి తమ సంస్థలను నడిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. వ్యాపారంలో మార్పులు చేయడానికి, దీర్ఘకాలికంగా విలువను సృష్టించడానికి సంస్థల కొనుగోళ్లు, విలీనాల దోహదపడగలవని సీఈవోలు భావిస్తున్నట్లు ఈవై ఇండియా చైర్మన్‌ రాజీవ్‌ మెమానీ తెలిపారు.

మరిన్ని వార్తలు