2022లోనే చంద్రయాన్-3 ప్రయోగం

28 Jul, 2021 17:35 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశ ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగాన్ని 2022 మూడో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేడు(జూలై 28) తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దాని పురోగతికి ఆటంకం కలిగిందని నొక్కి చెప్పారు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ చంద్రయాన్-3 ప్రయోగాన్ని రీషెడ్యూల్ చేసినట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగింది అని ఆయన అన్నారు. అయితే, లాక్ డౌన్ సమయాల్లో కూడా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పనులు చేసినట్లు పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి కాలంలో ఇస్రో శాస్త్రవేత్తలు సాధ్యమైన అన్ని పనులు చేశారు అన్నారు. అన్ లాక్ తర్వాత చంద్రయాన్-3 ప్రాజెక్టు వేగం పెరిగింది, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు చివర దశలో ఉన్నట్లు ఆయన చెప్పారు. 2019 జూలై 22న అత్యంత శక్తివంతమైన జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ ద్వారా చంద్రయాన్‌-2 మిషన్‌ చేపట్టారు. అయితే, సెప్టెంబర్ 7, 2019న చంద్రుని ఉపరితలం మీద దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయింది. ఈ ప్రయోగంతో తొలి ప్రయత్నంలోనే చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగిన మొదటి అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలవాలని అనుకుంది. కానీ, చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో భవిష్యత్తులో చేపట్టేబోయే అంతరిక్ష ప్రయోగాలకు చంద్రయాన్‌-3 కీలకం కానుంది.

మరిన్ని వార్తలు