చార్జింగ్‌ స్టేషన్లు: ఎంఅండ్‌ఎం, చార్జ్‌ప్లస్‌జోన్‌ జట్టు

28 Oct, 2022 14:09 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై కసరత్తు 

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టబోతున్న మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) తమ వాహనాలకు చార్జింగ్‌ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) చార్జింగ్‌ మౌలిక సదుపాయాల సంస్థ చార్జ్‌+జోన్‌తో జట్టు కట్టింది. ఈ ఒప్పందం కింద వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ ఫోర్‌ వీలర్ల కోసం వేగవంతమైన డీసీ చార్జర్ల ఏర్పాటు, నిర్వహణ అవకాశాలను ఇరు సంస్థలు పరిశీలించనున్నాయి. మహీంద్రా అనుబంధ సంస్థలు, గ్రూప్‌ సంస్థలకు చెందిన సొంత స్థలాలు, అద్దె స్థలాలు, కార్యాలయాలు, లేక ఇతరత్రా మహీంద్రా ఎంపిక చేసుకున్న స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఎంఅండ్‌ఎం యూజర్లతో పాటు ఇతరత్రా వాహనదారులు కూడా ఉపయోగించుకునేలా ఉంటాయి. ఎంఅండ్‌ఎం కొత్తగా అయిదు ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాలను (ఈ-ఎస్‌యూవీ) ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2024-2026 మధ్య తొలి నాలుగు మార్కెట్లోకి రానున్నాయి. చార్జ్‌+జోన్‌ దేశవ్యాప్తంగా 1,450 చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసింది. రోజూ సుమారు 5,000 ఈవీలకు సర్వీసులు అందిస్తోంది.

ఈ-ఎస్‌యూవీల కోసం దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ చార్జింగ్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేవడంతో పాటు దేశీయంగా విద్యుత్‌ వాహనాల వ్యవస్థ మరింతగా వృద్ధి చెందేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని చార్జ్‌+జోన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో కార్తికేయ్‌ హరియాణి తెలిపారు. తమ కంపెనీ కస్టమర్లందరికీ భారీ స్థాయిలో ఈవీ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎంఅండ్‌ఎం ప్రెసిడెంట్‌ (ఆటోమోటివ్‌ విభాగం) విజయ్‌ నాక్రా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు