సరికొత్త టెక్నాలజీతో ఈవీ ఛార్జింగ్ సమస్యలకు చెక్!

27 Jul, 2021 21:13 IST|Sakshi

రోజు రోజుకి టెక్నాలజీ వేగంగా మారిపోతుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాలను నడుపుతున్న వినియోగదారులు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ఎలక్ట్రిక్ వాహనాలను వేదిస్తున్న ప్రధాన సమస్య ఛార్జింగ్. ఈ సమస్యకు చెక్ పెడుతూ ఒక దశాబ్దం క్రితం దక్షిణ కొరియాలోని శాస్త్రవేత్తలు మొదటసారి రహదారి మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కార్లు, బస్సులు ఆటోమెటిక్ గా ఛార్జ్ అయ్యే విధంగా మార్గాన్ని అన్వేషించారు. తాజాగా, అమెరికాలోని ఇండియానా డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్(ఇండోట్), పర్డ్యూ విశ్వవిద్యాలయం సహకారంతో ప్రపంచంలోని మొట్టమొదటి వైర్ లెస్-ఛార్జింగ్ కాంక్రీట్ పేవ్ మెంట్ హైవే సెగ్మెంట్ ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది.

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా జర్మన్ స్టార్టప్ మాగ్మెంట్ అభివృద్ధి చేసిన అయస్కాంత స్వభావం గల కాంక్రీట్ ఉపయోగించనున్నారు. దీని వల్ల ఎలక్ట్రిక్ వేహికల్స్ కు బ్యాటరీ ఛార్జింగ్ సమస్య ఉత్పన్నం కాదు. ఇండియానా రాష్ట్ర గవర్నర్ ఎరిక్ జె. హోల్కోంబ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రాన్ని అమెరికా కూడలిగా పిలుస్తారు. అభివృద్ధి చెందుతున్న వాహన సాంకేతికతకు మద్దతు తెలపడం వల్ల ఇంకా రాష్ట్ర ప్రతిష్టను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ భాగస్వామ్యం కింద వైర్ లెస్ ఛార్జింగ్ హైవే టెక్నాలజీని అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నిధులు అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే వేసవిలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా రవాణా శాఖ పావు మైలు పొడవైన టెస్ట్ బెడ్ ను నిర్మిస్తుంది. అప్పుడు, ఇంజనీర్లు ట్రక్కులను ఛార్జ్ చేసే కాంక్రీట్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరగడంతో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతూనే ఉందని ఇండోట్ కమిషనర్ జో మెక్ గిన్నిస్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు