మెడికల్‌ లైసెన్సింగ్‌ పరీక్షల్లో చాట్‌జీపీటీ పాస్‌..ఇకపై విద్యార్ధులకు పేపర్‌పైనే పరీక్షలు!

31 Jan, 2023 11:00 IST|Sakshi

ప్రముఖ ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ చాట్‌జీపీటీ ఇటీవల నిర్వహించిన అన్నీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. దీంతో ఆయా యూనివర్సిటీలు విద్యార్ధులకు ఏ తరహాలో ఎగ్జామ్స్‌ నిర్వహించాలోననే సందిగ్ధంలో పడ్డారు.

గత ఏడాది నవంబర్‌ నెలలో ఓపెన్‌ ఏఐ అనే సంస్థ గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ తరహాలో చాట్‌ జీపీటీ అనే సెర్చ్‌ ఇంజిన్‌ బీటా వెర్షన్‌లో విడుదల చేసింది. విడుదలైన రోజుల వ్యవధిలో మిలియన్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ దేశాల్లో వినియోగదారులు చాట్‌జీపీటీలో వారికి కావాల్సిన అంతుచిక్కని అనేక ప్రశ్నలకు సెకన్ల వ్యవధిలో ఖచ్చితమైన సమాధానాలు తెలుసుకోవడంతో ఆదరణ మరింత పెరిగింది. 

ఈ తరుణంలో చాట్‌జీపీటీ ప్రముఖమైన యూఎస్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామ్‌, వాట్రార్న్‌ బిజినెస్‌ స్కూల్‌లో నిర్వహించిన ఎంబీఏ ప్రోగ్రామ్‌ ఫైనల్‌ ఆపరేన్స్‌ మేనేజ్మెంట్‌ కోర్స్‌, మినసొట్టా న్యాయ కళాశాలలో  రాజ్యాంగ చట్టం గురించి నిర్వహించిన ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. 


 
చాట్‌జీపీటీ యూఎస్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంపై చాట్‌జీపీటీ పెట్టుబడి దారుడు, ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. అన్‌యూజ్‌వల్‌ వేల్స్‌ (unusual_whales) అనే ట్వీటర్‌ అకౌంట్‌ను రీట్వీట్‌ చేస్తూ ‘అంతా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను’ అని తెలిపారు. 

50 శాతం ఉత్తీర్ణత 
అమెరికాలో అత్యంత కఠినంగా ఉండే యూఎస్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామ్‌ (యూఎస్‌ఎంఎల్‌ఈ)లో చాట్‌జీపీటీ 50 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. యూఎస్‌ఎంఎల్‌ఈ ఇచ్చే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను ప్రొఫెసర్లు చాట్‌జీపీటీలో టైప్‌ చేశారు. అలా టైప్‌ చేసిన సెకన్ల వ్యవధిలో అన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఆశ్చర్యంగా మారింది. అయితే విద్యార్ధులకు నిర్వహించే పరీక్షల్లో కంప్యూటర్‌, ట్యాబ్స్‌ వంటి పరికరాల్ని వినియోగించకుండా చేతితో రాసే విధానాన్ని అమలు చేయాలని రీసెర్చర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు