Checkout Com Founder: డిగ్రీలో డ్రాపవుట్‌.. కంపెనీ పేరు చెక్‌అవుట్‌.. ఇప్పుడు బిలియనీర్‌

18 Jan, 2022 08:29 IST|Sakshi

ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్‌ సర్కిళ్లలో గియామ్‌ పోసాజ్‌ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. నలభై ఏళ్ల వయస్సు నిండకుండానే బ్రిటన్‌లో అత్యంత సంపన్నమైన ఫిన్‌టెక్‌ కంపెనీ యజమానిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇండియన్‌ కరెన్సీలో అతని సంపద విలువల లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఉండగా అతని కంపెనీ విలువయితే మూడు లక్షల కోట్ల రూపాయలకు పైమాటగానే ఉంది. అయితే ఈ విజయం అతనికి ఊరికే రాలేదు.


స్విట్జర్లాండ్‌కి చెందిన గియామ్‌ పోసాజ్‌కి చిన్నప్పటి నుంచి ఆర్థిక శాస్త్రం అంటే ఇష్టం. అందుకు డిగ్రీలో ఎకనామిక్స్‌లో చేరాడు. ఎకనామిక్స్‌ పట్టా పుచ్చుకుని స్టాక్‌ బ్రోకర్‌ కావాలనేది అతని లక్ష్యం. కానీ విధి మధ్యలోనే అతని కలలకి బ్రేక్‌ వేసింది. డిగ్రీ ఫైనలియర్‌కి రాకముందే పాంక్రియస్‌ క్యాన్సర్‌తో అతని తండ్రి 2005లో మరణించాడు. దీంతో మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. ఉన్న ఊరే కాదు దేశంలోనే ఉపాధి లభించక వలస జీవిలా అమెరికాలోకి కాలిఫోర్నియాకు 2006లో చేరుకున్నారు.

వలస జీవిగా మొదలు
కాలిఫోర్నియాకు చెందిన ఓ డిజిటల్‌ పేమెంట్‌ సంస్థలో ఉద్యోగిగా గియామ్‌ పోసాజ్‌ చేరాడు. అక్కడ పని చేస్తున్నప్పుడే డిజిటల్‌ పేమెంట్స్‌లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్వయంగా చూశాడు. వాటిని ఎలా పరిష్కరించవచ్చా అని ఆన్‌లైన్‌లో సర్ఫ్‌ చేశాడు. కళ్లెదుట కనిపిస్తున్న సమస్యలు ఇంటర్నెట్‌లో చూచాయగా కనిపిస్తున్న పరిష్కారం. అంతే మెడడుకి పని పెట్టాడు... గంటల తరబడి శ్రమించాడు. ఉత్తమైన డిజిటల్‌ పేమెంట్‌ పద్దతులతో ఓ స్టార్టప్‌ స్థాపించాడు. అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇతర ఫిన్‌టెక్‌ కంపెనీలతో పోటీ పడి తన స్టార్టప్‌ మనుగడ సాగించలేదని గమనించి.. ముందుగా మారిషన్‌ని వేదికగా సర్వీస్‌ స్టార్‌ చేశాడు. అక్కడ గడించిన అనుభవంతో ఈ సారి ఇంగ్లాండ్‌కి పయణమయ్యాడు గియామ్‌ పోసాజ్‌.

లండన్‌ కేంద్రంగా
మారిషస్‌లో వచ్చిన అనుభవంతో చెక్‌అవుట్‌ డాట్‌ కామ్‌ పేరుతో ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసే స్టార్టప్‌ని 2012లో లండన్‌ కేంద్రంగా పోసాజ్‌ స్థాపించాడు. స్పీడ్‌గా సులువుగా డిజిటల్‌ పేమెంట్స్‌ అందించే సంస్థగా క్రమంగా చెక్‌ అవుట్‌ డాట్‌కామ్‌ ఎదిగింది. క్రమంగా ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడుటలు పెట్టడం కొసాగించారు. ఇంగ్లాండ్‌ నుంచి క్రమంగా యూరప్‌లో ఒక్కో దేశంలో నెట్‌వర్క్‌ విస్తరించుకుంటూ పోయాడు. నెట్‌ఫ్లిక్స్‌, గ్రాబ్‌, సోనీ, కాయిన్‌ బేస్‌, క్రిప్టో డాట్‌ కమ్‌ వంటి సంస్థలు చెక్‌అవుట్‌ సేవలు వినియోగించుకోవడం ప్రారంభించాయి.

రూ. 1.20 లక్షల కోట్లు
ప్రస్తుతంతో ట్రెడింగ్‌లో ఉన్న బిజినెస్‌తో పాటు ఫ్యూచర్‌ టెక్నాలజీగా చెప్పుకుంటున్న బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత సేవలు, వెబ్‌ 3లోనూ చెక్‌ అవుట్‌ దూసుకుపోతుండటం చూసి ఇన్వెస్టర్లు ఇంప్రెస్‌ అయ్యారు. ఇటీవల చెక్‌ అవుట్‌ విస్తరణ కోసం  గ్రూప్‌ ఆఫ్‌ ఇన్వెస్టర్లు ఏకంగా బిలియన్‌ డాలర్లు పెట్టుబడి అందించారు. దీంతో ఒక్కసారిగా ఈ కంపెనీ వాల్యుయేషన్‌ 40 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇందులో పోసాజ్‌ వాటా 16 బిలియన్‌ డాలర​‍్లుగా ఉంది. ఇండియన్‌ కరెన్సీలో ఇంచుమించు రూ.1.20 లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. ప్రస్తుతం అతని వయస్సు 40 ఏళ్లు మాత్రమే. 

టాప్‌ 100లో చోటు 
తనకు ఇష్టమైన రంగంలో తనకు నచ్చిన పని చేయడంలో పోసాజ్‌ పిసినారిలా వ్యవహరించలేదు. కంపెనీ విస్తరించే క్రమంలో కుటుంబానికి దూరం అయ్యాడు. దేశదేశాలు తిరుగుతూ హోటళ్లలోనే ఐదారేళ్లు గడిపాడు. వారానికి 80 గంటల పాటు నిర్విరామంగా పని చేశారు. ఫలితంగా అతి తక్కువ వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత సంపన్ను జాబితా 100లో గియామ్‌ పోసాజ్‌ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం భార్య, ఇద్దరు పిల్లలతో దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ఇంటినే ఆఫీస్‌గా చేసి అంతర్జాతీయంగా కంపెనీ పనితీరుని పర్యవేక్షిస్తున్నాడు. 

చదవండి: బిల్‌గేట్స్‌ పేరెత్తితే ఆనంద్‌ మహీంద్రాకి చిరాకు

మరిన్ని వార్తలు