ఐపీవోకు మరో రెండు కంపెనీలు రెడీ

7 Sep, 2021 21:14 IST|Sakshi

సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌  

జాబితాలో కెమ్‌స్పెక్‌ కెమికల్స్‌, నార్తర్న్‌ ఆర్క్‌ క్యాపిటల్‌  

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టడం ద్వారా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు మరో రెండు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. ఇందుకు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందాయి. వీటిలో కెమ్‌స్పెక్‌ కెమికల్స్, నార్తర్న్‌ ఆర్క్‌ క్యాపిటల్‌ ఉన్నాయి. ఐపీవో ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు వీలుగా జులైలోనే ఈ రెండు కంపెనీలూ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి.  

కెమ్‌స్పెక్‌ కెమ్‌.. 
స్పెషాలిటీ కెమికల్స్‌ తయారు చేసే కెమ్‌స్పెక్‌ కెమికల్స్‌ ఐపీవో ద్వారా రూ.700 కోట్లు సమకూర్చుకునే సన్నాహాల్లో ఉంది. కంపెనీ ప్రమోటర్లు మితుల్‌ వోరా, రిషభ్‌ వోరా విడిగా రూ. 233.3 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా బీఏసీఎస్‌ ఎల్‌ఎల్‌పీ సైతం రూ. 233.4 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ చేయనుంది. వెరసి ప్రమోటర్లే పూర్తిస్థాయిలో నిధులను సమకూర్చుకోనున్నారు.(చదవండి: మన క్రెడిట్ స్కోరును వేగంగా ఎలా పెంచుకోవాలి..?)

కంపెనీ ప్రధానంగా స్కిన్, హెయిర్‌కేర్‌ ప్రొడక్టుల తయారీలో వినియోగించే కీలక ఎడిటివ్స్‌ను రూపొందిస్తోంది. ఎఫ్‌ఎంసీజీ విభాగంతోపాటు.. అధిక రక్తపోటు నివారణకు వినియోగించే ఔషధాలకు అవసరమయ్యే ఫార్మా ఏపీఐలను సైతం తయారు చేస్తోంది. మహారాష్ట్ర తలోజలో తయారీ ప్లాంటును కలిగి ఉంది. 

నార్తర్న్‌ ఆర్క్‌.. 
ఆర్‌బీఐ వద్ద డిపాజిట్లు స్వీకరించని ఎన్‌బీఎఫ్‌సీగా రిజస్టరైన నార్తర్న్‌ ఆర్క్‌ క్యాపిటల్‌ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా 3.65 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని సైతం కొత్తగా జారీ చేయనుంది. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించనున్న నిధులను కంపెనీ మూలధన పటిష్టతకు వినియోగించనుంది. తద్వారా భవిష్యత్‌ పెట్టుబడి అవసరాలకు వాడుకోనుంది. కంపెనీ దశాబ్ద కాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన లీప్‌ఫ్రాగ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌-2, యాక్సియన్‌ ఆఫ్రికా-ఆసియా ఇన్వెస్ట్‌మెంట్, ఆగస్టా ఇన్వెస్ట్‌మెంట్స్‌2, ఎయిట్‌ రోడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మారిషస్‌-2 తదితరాలు ఐపీవోలో వాటాలను ఆఫర్‌ చేయనున్నాయి.(చదవండి: బ్యాటరీతో నడవనున్న హీరో స్ప్లెండ‌ర్ బైక్)

తమిళనాడు మెర్కంటైల్‌ బ్యాంక్‌  కూడా
ప్రయివేట్‌ రంగ సంస్థ తమిళనాడు మెర్కంటైల్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను (ప్రాస్పెక్టస్‌) దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో బ్యాంక్‌ 1.58 కోట్లకుపైగా షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 12,505 షేర్లను వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించనున్న నిధులను టైర్‌-1 మూలధన పటిష్టతకు కేటాయించనుంది.

తద్వారా భవిష్యత్‌ పెట్టుబడి అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో వెల్లడించింది. 100 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన బ్యాంక్‌ అత్యంత పురాతన సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. వివిధ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులను అందిస్తోంది. ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయం, రిటైల్‌ కస్టమర్లకు ప్రాధాన్యత ఇస్తోంది. 2021 జూన్‌కల్లా 509 బ్రాంచీలను నిర్వహిస్తోంది. 4.93 మిలియన్‌ కస్టమర్లను కలిగి ఉంది. 

మరిన్ని వార్తలు