ఇండియాలో ఫ్లైయింగ్​ కారు... వచ్చేది ఎప్పుడంటే ?

17 Aug, 2021 08:11 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: దేశమంతటా ఎలక్ట్రిక్‌ వాహనాల ట్రెండ్‌ నడుస్తోంటే అందుకు భిన్నంగా ఏకంగా ఆకాశంలో ఎగిరే కారు తయారీలో బిజీగా ఉన్నాయి స్టార్టప్‌ కంపెనీలు. అందులో ఇండియాకి చెందిన ఓ కంపెనీ అయితే అక్టోబరులో తమ తొలి మోడల్‌ కారును ప్రదర్శనకు సిద్ధం చేస్తోంది. 

అక్టోబరు 5 కల్లా సిద్ధం
చెన్నై బేస్డ్‌ వినత ఎయిరో మొబిలిటీ కంపెనీ ఎగిరే కార్ల తయారీలో మరో కీలక ఘట్టాన్ని దాటేసింది. ఎగిరే కారు కాన్సెప్టుకు సంబంధించి పూర్తి డిజైన్‌ని పూర్తి చేసింది. ఇప్పుడు కారు నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. అన్నీ అనుకూలిస్తే 2021 అక్టోబరు 5న లండన్‌లో జరిగే హెలిటెక్‌ ఎగ్జిబిషన్‌లో ఈ కారు దర్శనం ఇవ్వనుంది. 

ఇద్దరు ప్యాసింజర్లు
వినత ఎయిరో మొబిలిటీ రూపొందిస్తోన్న ఫ్లైయింగ్‌ కారు బరువు 1100 కేజీలు ఉంటుంది. మొత్తంగా 1300 కేజీల బరువును మోయగలదు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే వీలుంటుంది. వర్టికల్‌గా టేకాఫ్‌ ల్యాండింగ్‌ అవడం ఈ ఫ్లైయింగ్‌ కారు ప్రత్యేకత. ఈ కారులో హైబ్రిడ్‌ ఇంజన్‌ ఏర్పాటు చేస్తున్నారు. కారు ఎగిరేందుకు బయో ప్యూయల్‌ని ఉపయోగించుకుంటుంది. అదే విధంగా సందర్భాన్ని బట్టి ఎలక్ట్రిక్‌ ఎనర్జీని కూడా వాడుకుంటుంది. 

3,000 అడుగుల వరకు
ఈ కారు పైకి ఎగిరేందుకు కో యాక్సియల్‌ క్వాడ​ రోటర్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారు ప్యానెల్‌లో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ వాడుతున్నట్టు కంపెనీ చెబుతోంది. ఈ కారు నేల నుంచి 3,000 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించగలదు. ఒక్క సారి ఫ్యూయల్‌ నింపితే వంద కిలోమీటర్లు లేదా గంట సేపు ప్రయాణం చేయగలదు. అత్యధిక వేగం గంటకు 120 కిలోమీటర్లుగా ఉంది. 

ఫస్ట్‌ ఏషియన్‌
ఇప్పటి వరకు ఫ్లైయింగ్‌ కార్లకు సంబంధించి యూరప్‌, అమెరికా కంపెనీలదే పై చేయిగా ఉంది. ఏషియా నుంచి హ్యుందాయ్‌ సంస్థ కూడా ఫ్లైయింగ్‌ కారు టెక్నాలజీపై పరిశోధనలు చేస్తోంది. అయితే డిజైన్‌ పూర్తి చేసి అక్టోబరు కల్లా ప్రోటోటైప్‌ సిద్ధం చేసిన మొదటి ఏషియా కంపెనీగా రికార్డు సృష్టించేందుకు వినత సిద్ధమవుతోంది.
 

మరిన్ని వార్తలు