Chennai: నగరజీవికి మోయలేని భారం.. తప్పక కట్టాల్సిందే గురూ!

25 Sep, 2022 07:13 IST|Sakshi

చెన్నై మహానగరం పరిధిలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి.. యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. ఎడాపెడా అద్దె మొత్తాన్ని పెంచేస్తూ సామాన్యులపై భారం మోపుతున్నారు. అంత కట్టలేమంటే వెళ్లిపోమంటూ ఈసడించుకుంటున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ నిర్ణయం అశనిపాతంగా మారుతోంది.

సాక్షి, చెన్నై: పెరిగిన విద్యుత్‌ బిల్లులు, ఆస్తి, నీటిపన్నులతో సతమతం అవుతున్న నగరజీవికి ఇంటి అద్దె పెరుగుదల మోయలేని భారంగా మారుతోంది. చెన్నై మహానగరంలో ఉద్యోగం, విద్యా, వ్యాపారం కోసం వచ్చి స్థిర పడ్డ వారి సంఖ్య ఎక్కువే. వీరిలో మెజారిటీ  ప్రజలు అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. వీరి అవసరాలు ఇంటి యజమానులకు కాసుల వర్షం కురిపిస్తోంది. చెన్నై శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో పెద్దసంఖ్యలో పారిశ్రామిక వాడలున్నాయి.

ఇక్కడ ఉద్యోగ రిత్యా రాష్ట్రానికి చెందిన వారే కాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు. ఇటీవల ఉత్తరాది నుంచి వివిధ పనుల నిమిత్తం చెన్నై వస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో  చెన్నై, సెంట్రల్‌ చెన్నై, దక్షిణ చెన్నైతో పాటు శివారులలోని వేళచ్చేరి, ఈసీఆర్, ఓఎంఆర్‌ మార్గాలు, అంబత్తూరు, పూందమల్లి, రెడ్‌ హిల్స్, మాధవరం, ఆవడి, తాంబరం, పల్లావరం, క్రోం పేట, పెరుంగళ్తూరు, ముడిచ్చూరు పరిసరాలలో అద్దె ఇల్లు దొరకడం గగనంగా మారింది. సాఫ్ట్‌వేర్‌ వంటి పెద్ద సంస్థలలో పనిచేసే ఉద్యోగులు మాత్రం తమకు సౌకర్యవంతంగా ఉండే అపార్ట్‌మెంట్స్‌ను బాడుగకు తీసుకుంటున్నారు. 

వడ్డనతో భారం.. 
చెన్నై నగరంలో నెలసరి అద్దె అధికంగానే ఉంటోంది. చిన్న గది అయినా కనీసం రూ. 5 వేలు పైగా వెచ్చించాల్సిందే. సింగిల్‌ బెడ్‌ రూమ్‌ కావాలంటే రూ.10 వేలు, మరి కాస్త పెద్దది కావాలంటే రూ. 15 వేలు, రూ. 20 వేలు, రూ. 25 వేలు వరకు అద్దె చెల్లించాల్సిందే.  అన్నానగర్, అడయార్, తిరువాన్మీయూరు, ఈసీఆర్, ఓఎంఆర్‌ తదితర మార్గాల్లో కొంత సౌకర్యాలు కల్గిన ప్రాంతాల్లో రెట్టింపు అద్దె చెల్లించుకోక తప్పదు. ఇక, కొన్నిచోట్ల విద్యుత్‌ బిల్లులకు మీటరుతో సంబంధం ఉండదు. ఇంటి యజమాని నిర్ణయించే మీటర్‌ రీడింగ్‌ చార్జీను చెల్లించక తప్పదు.

పన్నులు పెంచితే చాలు..
అసలే కరోనా మిగిల్చిన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రజల్ని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. చెన్నై వంటి నగరాలలో ఆస్తిపన్ను, నీటి పన్ను ఇటీవలే అదనంగా వడ్డించారు. అలాగే, విద్యుత్‌ బిల్లుల మోత మోగింది. ఈ ప్రభావం ఇళ్ల యజమానులపై పడింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు వారు అద్దెను అమాంతం పెంచేస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబరు నుంచి అనేక చోట్ల అద్దె పెంచుతూ యజమానులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అద్దెతో పాటు అదనంగా..
కొన్నిచోట్ల ఇంటి అద్దెతో పాటు విద్యుత్, తాగునీరు, మెయింట్‌నెన్స్‌ చార్జీలను పెంచేశారు. ఈ విధంగా కుటుంబ ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని ఇంటి అద్దె రూపంలో చెల్లించడం ద్వారా మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి. ప్రస్తుతం లగ్జరీతో కూడిన అపార్ట్‌మెంట్లకు 13, 14 శాతం మేరకు, చిన్న చిన్న రూములు, సింగిల్‌ బెడ్‌ రూం, డబుల్‌బెడ్‌ రూం ఇళ్లకు 25 శాతం వరకు అద్దెను పెంచారు.

దీంతో ఇది వరకు రూ. 5 వేలు చెల్లిస్తున్న వారు ప్రస్తుతం రూ. 7 వేల వరకు, రూ.10 వేలు చెల్లిస్తున్న వారు రూ. 13 వేల వరకు అద్దె భారాన్ని భరించాల్సిన పరిస్థితి చెన్నైలో నెలకొంది. నిబంధనలు దాటి ఇంటి అద్దెలు అధికంగా వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్‌ అధికారులు పేర్కొంటున్నా, ఆ దిశగా చర్యలు తీసున్న దాఖలాలు లేవు. ఇంటి బాడుగలను క్రమబద్దీకరించే విధంగా మార్గదర్శకాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న వారిలో మధ్య తరగతి కుటుంబాలే అధికంగా ఉండడం గమనార్హం. 

చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లకు భారీ షాక్‌! 

మరిన్ని వార్తలు