కొండెక్కిన కోడి..శ్రావణంలోనూ తగ్గని చికెన్‌ ధర

20 Aug, 2021 11:29 IST|Sakshi

మేత ధర పెరిగిందంటున్న పెంపకందార్లు

గణనీయంగా తగ్గిన బ్రాయిలర్‌  పెంపకం

కొత్త బ్యాచ్‌లకు కోళ్ల రైతులు వెనుకంజ 

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి

మండపేట: శ్రావణంలోనూ చికెన్‌ ధర దిగిరావడం లేదు. రూ.300లకు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. రెండు నెలల వ్యవధిలో రెండు నుంచి మూడు రెట్లు పెరిగిన మేత ధరలు కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ, చత్తీస్‌గడ్‌ నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు విశ్లేషిన్నారు. కోడిగుడ్డు ధర మాత్రం కొంతమేర వినియోగదారులకు ఊరటనిస్తోంది. 

పండగరోజుల్లో..
తూర్పు గోదావరి జిల్లాలో సాధారణంగా రోజుకు 2.5 లక్షల కిలోల మేర చికెన్‌ వినియోగిస్తున్నారు. ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా. జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 ఫామ్‌లలో ఏడు లక్షలకు పైగా బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం జరుగుతుంది. 40 రోజుల్లో బ్రాయిలర్‌ కోళ్లు వినియోగానికి సిద్దమవుతుంటాయి. ఈ మేరకు రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్‌ వినియోగం తగ్గుతుంది. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు ఆన్‌సీజన్‌గా భావించి కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని తగ్గించడం పరిపాటి.

కారణమేంటంటే..
-  కోవిడ్‌ ఆంక్షలు సడలించినా మేత ధరలు అదుపులోకి రావడం లేదు.
- ఆంక్షలు కారణంగా జూలైలో మేత రవాణా నిలిచిపోయింది.  ధరలు పెరగడం మొదలైంది. 
- బ్రాయిలర్‌ కోడి మేతలో ప్రధానమైన సోయాబిన్‌ కిలో రూ.35 నుంచి రెండు నెలల వ్యవధిలో ఏకంగా రూ.106కు పెరిగిపోయింది. 
- మొక్కజొన్న రూ.12నుంచి రూ. 23కు పెరిగినట్టు కోళ్ల రైతులు చెబుతున్నారు.
- కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు పౌష్టికాహారంగా చికెన్‌ వినియోగం అధికం కావడంతో గత నెలలో కిలో చికెన్‌ రూ. 320వరకూ చేరింది. తర్వాత రూ.230ల నుంచి రూ.250లకు తగ్గింది.
- వారం రోజులగా మళ్లీ ధరకు రెక్కలొస్తున్నాయి. ఆన్‌ సీజన్, మేత ధరలకు జడిసి కొత్త బ్యాచ్‌లు వేయకపోవడంతో యిలర్‌ పెంపకం సగానికి పైగా తగ్గిపోయింది. 

దిగుమతిపై ఆధారం
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, తెలంగాణలోని ఆశ్వారావుపేట, సత్తుపల్లి, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో చికెన్‌ ధరలకు మరలా రెక్కలొస్తున్నాయి. బుధవారం కిలో రూ.300కు చేరగా, లైవ్‌ కిలో రూ.135లు వరకు పెరిగింది. వినియోగం సాధారణంగానే ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారవర్గాల అంచనా. అయితేగుడ్డు ధర క్రమంగా తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. రైతు ధర తగ్గిపోవడంతో ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో గుడ్డు రూ.5కి చేరుకుంది.

మేత తగ్గితేనే కొత్త బ్యాచ్‌లు - బొబ్బా వెంకన్న బ్రాయిలర్‌ కోళ్ల రైతు
శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపిస్తోంది. అయితే ఎ‍ప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే మేత ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆన్‌సీజన్‌ మొదలు కావడం, మేత ధరలకు జడిసి ఎవరూ కొత్త బ్యాచ్‌లను వేయడం లేదు. దీంతో పక్క రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి.

కీ పాయింట్స్‌
- తూర్పు గోదావరి జిల్లాలో చికెన్‌ వినియోగం రోజుకి 2.50 లక్షల కిలోలు
- బ్రాయిలర్‌ కోళ్ల ఫామ్స్‌ సంఖ్య 400
- రిటైల్‌ మార్కెట్‌లో కిలో చికెన్‌ రూ. 300
- కోళ్ల మేత సోయబిన్‌ ధరల్లో పెరుగుదల రూ. 35 నుంచి రూ.100

చదవండి: సాగుకు ‘టెక్‌’ సాయం..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు