పేలిన చైనా ఫోన్‌..మహబూబ్‌నగర్‌ వాసి ఫిర్యాదు,కంపెనీ రియాక్షన్‌ ఇది..

2 Dec, 2021 15:33 IST|Sakshi

China Poco M3 battery explodes in india : చైనాకు చెందిన మరో కంపెనీ స్మార్ట్‌ ఫోన్‌ పేలింది. నవంబర్‌ 3న చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ ప్లస్‌ కు చెందిన వన్‌ ప్లస్‌ నార్డ్‌ 2 ఫోన్‌ పేలిందంటూ ట్విట్టర్‌ యూజర్‌ సుహిత్‌ శర్మ ట్వీట్‌ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీకి చెందిన మరో స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ 'పోకో' కు చెందిన 5జీ ఫోన్‌ పేలింది.    

ట్వీట్‌ ప్రకారం.. 
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 'పోకో' ఈ ఏడాది మనదేశంలో 'పోకో ఎం3' అనే 5జీ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంఛ్‌ చేసింది. లాంఛ్‌ సందర్భంగా మహబూబ్‌నగర్‌ కు చెందిన ఓ యువకుడు ఆఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే తాజాగా (నవంబర్‌ 27న) ఆ ఫోన్‌ పేలింది. దీంతో ఫోన్‌ పేలుడు ఘటనపై బాధితుడి అన్న మహేష్‌ ట్వీట్‌ చేశాడు. తన తమ్ముడు వినియోగిస్తున్న ఈ  5జీ ఫోన్‌ పేలిదంటూ మహేష్‌ ట్విట్‌లో పేర్కొన్నాడు. కానీ ఎందుకు పేలింది అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు.

మరి కొద్ది సేపటికి మహేష్‌ ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు. కానీ అప్పటికే పోకో ఫోన్‌ పేలింది అంటూ  సౌరబ్‌ హతి అనే ట్విట్టర్‌ యూజర్‌ మహేష్‌ ట్వీట్‌ను షేర్‌ చేశారు. సౌరబ్‌ హతి ట్వీట్‌పై పోకో ప్రతినిధులు స్పందించారు. యూజర్ల భద్రతే తమకు ముఖ్యం అంటూ, ఫోన్‌ పేలడాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటాం' అంటూ రిప్లయి ఇచ్చారు. 

మహేష్‌ షేర్‌ చేసిన ట్వీట్‌లో 
బాధితుడి అన్న చేసిన ట్వీట్‌ ఆధారంగా పోకో 5జీ ఫోన్‌ కింది సగభాగం వరకు పూర్తిగా కాలిపోయింది. కెమెరా మాడ్యుల్‌ మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫోన్‌ పేలడంపై పలు నేషనల్‌ మీడియా పోకో సంస్థను సంప్రదించింది. దీంతో ఫోన్‌ పేలుడుకు సంబంధించి పోకో బృందం దర్యాప్తు చేస్తుంది. సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అంతేకాదు పోకో' కి ఇండియన్‌ యూజర్ల భద్రత చాలాముఖ్యం. ఇలాంటి విషయాల్ని చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటాం. సమస్యను పరిశీలించి కస్టమర్‌కు అండగా నిలుస్తాం అంటూ వివరణ ఇచ్చింది.

చదవండి : యువకుడి జీన్స్‌ ఫ్యాంట్‌లో స్మార్ట్‌ ఫోన్‌ పేలింది..! 

మరిన్ని వార్తలు