Bao Fan: చైనా బ్యాంకర్‌ మిస్సింగ్‌ సంచలనం! ఇంతకీ ఎవరతను?

19 Feb, 2023 10:12 IST|Sakshi

చైనాలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం చోటుచేసుకుంటూనే ఉంటుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్నారు. తాజాగా చైనా ప్రముఖ బ్యాంకర్ బావో ఫాన్ అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. బావోఫాన్‌ను సంప్రదించలేకపోతున్నట్టు బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ చైనా రినయిసెన్స్ ప్రకటించింది. ఈ వార్త వెలువడిన వంటనే ఆ కంపెనీ షేర్ ధర 50 శాతం పడిపోయింది. ఈ సంస్థలో అవినీతిపై చైనా ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బావోఫాన్ కనిపించకుండా పోవడం వెనుక ఆ దేశ ప్రభుత్వ హస్తం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కమ్యూనిస్ట్ పాలనలో ఉన్న చైనాలో వ్యాపార దిగ్గజాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వ్యాపారవేత్తలు ఇలా కనిపించకుండా పోవడం కొత్తేమీ కాదు. బావో ఫాన్‌కు ముందు కూడా అనేకమంది ఉన్నత వ్యాపార నిర్వాహకులు గల్లంతయ్యారు. 2015లోనే కనీసం ఐదుగురు అదృశ్యమయ్యారు. వాస్తవానికి బావోకు కొన్ని రోజుల ముందు, రియల్ ఎస్టేట్ సంస్థ సీజెన్ గ్రూప్ వైస్ చైర్మన్ కనిపించకుండా పోయారు. కొంతకాలం క్రితం చైనా టాప్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్‌మా గల్లంతయ్యారు. 

ఎవరీ బావోఫాన్‌?
చైనాలో ప్రఖ్యాతిగాంచిన బ్యాంకర్లలో బావోఫాన్‌ ఒకరు. షాంఘై నగరంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చైనా ప్రభుత్వంలో పనిచేసేవారు. అయినప్పటికీ అమెరికాలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు బావోఫాన్‌. షాంఘైలోని ఫుడన్ యూనివర్సిటీ, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి డిగ్రీలు పొందారు. 1990వ దశకంలో ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ సూయిస్ గ్రూప్‌ల కోసం పనిచేశాడు. అనంతరం షాంఘై, షెంజెన్‌లలోని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో అడ్వయిజర్‌గా పని చేశారు. 2005లో కేవలం ఇద్దరితో చైనా రినయిసెన్స్‌ను ప్రారంభించారు.

వెంచర్ కేపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు సేవలందించారు. ఆ తర్వాత అండర్‌రైటింగ్, సేల్స్, ట్రేడింగ్‌లకు తన సేవలను విస్తరించారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ 2018లో హాంగ్ కాంగ్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఏకంగా 346 మిలియన్ల డాలర్లను సేకరించింది. చైనాలోని ప్రధాన ఫుడ్ డెలివరీ సర్వీసులు మీటువాన్-డయాన్‌పింగ్, ట్రావెల్‌ సంస్థలు సీ ట్రిప్‌-క్యూనర్‌ విలీనాల్లో బావోఫాన్‌ కీలక పాత్ర పోషించారు. పలు నివేదికల ప్రకారం.. బావోఫాన్ నికర విలువ సుమారు 1.7 బిలియన్‌ డాలర్లు.

మరిన్ని వార్తలు