ఎలక్ట్రానిక్స్‌కు డ్రాగన్‌ షాక్‌!

27 Aug, 2021 02:12 IST|Sakshi

చైనా ఆంక్షలతో.. ధరలకు రెక్కలు!

కరోనా నియంత్రణకు కఠిన చర్యలు

ఎయిర్‌పోర్ట్‌లు, ఓడరేవుల్లో పరిమిత కార్యకలాపాలు

విడిభాగాల సరఫరాకు అంతరాయాలు

రెట్టింపైన రవాణా వ్యయాలు

పండుగల సీజన్‌లో ఉత్పత్తులకు కొరత

వినియోగదారులపై ధరల భారం

న్యూఢిల్లీ: చైనా కారణంగా మరో విడత దేశీయ ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా వైరస్‌ నియంత్రణకు చైనా కఠినంగా వ్యవహరిస్తుండడంతో కీలకమైన విడిభాగాల సరఫరాలో కొరతకు కారణమవుతోంది. దీంతో దేశీయ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారులు, స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు 10–30 శాతం మేర ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో చైనా ఆంక్షలు, నిషేధాజ్ఞలు విధించింది.

దేశీయంగా ముఖ్యమైన పండుగుల సీజన్‌లోనే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల విక్రయాలు భారీగా నమోదవుతుంటాయి. ఏడాది మొత్తం మీద 35–45 శాతం విక్రయాలు పండుగల సమయాల్లోనే కొనసాగుతుంటాయి. ఇదే సమయంలో కీలక విడిభాగాల కొరత నెలకొనడం ఈ ఏడాదికి సంబంధించి పరిశ్రమ వృద్ధి అంచనాలకు గండికొట్టేలా ఉంది. తాజా పరిణామాలతో రవాణా వ్యయాలు గడిచిన మూడు నెలల్లో రెట్టింపయ్యాయని.. ఉత్పత్తుల ధరలను పెంచక తప్పదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మనదేశంలో తయారయ్యే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు సంబంధించి 60–70 శాతం విడిభాగాలు చైనా నుంచే సరఫరా అవుతుంటాయి.

పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌ల మూత  
ఆగస్ట్‌ 21న సాంఘై పుడోంగ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేశారు. కార్మికులు కొంత మంది కరోనా వైరస్‌ బారిన పడడంతో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ పనులను నిర్వహిస్తున్న షాంఘై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ కరోనా క్వారంటైన్‌ పాలసీని ప్రకటించింది. అలాగే, చైనా నింగ్‌బో జోషువాన్‌ పోర్ట్‌ను సైతం మూసేశారు. చైనా సరఫరాలకు (ఎగుమతులు) షాంఘై, నింగ్‌బో రెండూ ముఖ్యమైనవి.

కరోనా విషయంలో ఉపేక్షించేది లేదన్న చైనా విధానానికి వీటిని నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. చైనాలో సుమారు 15 పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు కేవలం 30–70 శాతం సిబ్బందితో పరిమిత కార్యకలాపాలే నిర్వహిస్తుండడం గమనార్హం. వీటిల్లో ముఖ్యమైన బీజింగ్, షియామెన్‌ కూడా ఉన్నాయి. కరోనా కఠిన విధానాల ఫలితంగా ఇతర పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లైన హాంగ్‌కాంగ్, షెన్‌జెన్‌లోనూ రద్దీ పెరిగిపోయింది. ఫలితంగా ఎగుమతులకు రోజుల పాటు వేచి ఉండాల్సి రావడం పరిస్థితికి అద్దం పడుతోంది.

స్మార్ట్‌ఫోన్ల విక్రయాలపైనా ప్రభావం  
స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్‌ల అంచనాల్లోనూ కోతలు విధించుకోవాల్సిన పరిస్థితులే నెలకొన్నాయి. చైనాలోని, ఓడరేవులు, విమానాశ్రయాల్లో ఆంక్షల వల్ల డిమాండ్‌కు సరిపడా చిప్‌సెట్లు, ఇతర కీలక విడిభాగాల సరఫరా సాధ్యపడడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్‌ఆర్క్‌ అనే సంస్థ స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్‌లు 7 శాతం తగ్గొచ్చని తాజాగా అంచనా వేసింది. ఐడీసీ అనే సంస్థ ఈ ఏడాది మొత్తం మీద స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్‌లలో వృద్ధి ఉండకపోవచ్చని.. ఉన్నా ఒక్క శాతం వరకే ఉంటుందన్న తాజా అంచనాలను ప్రకటించింది.

వాస్తవానికి 16% మేర షిప్‌మెంట్‌లు పెరుగుతాయని ఇదే సంస్థ లోగడ అంచనా వేయడం గమనార్హం. తాజా పరిణామాలతో ఫోన్ల ధరలను పెంచాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కొరత కారణంగా పండుగల సీజన్‌లో విక్రయాలపైనా ప్రభావం పడొచ్చని అంచనా వేస్తున్నాయి. ‘‘2021లో 15.2–15.5 కోట్ల స్మార్ట్‌ఫోన్ల విక్రయాలను అంచనా వేస్తున్నాం. సరఫరాలో సమస్యల వల్ల ఈ ఏడాదికి సంబంధించి కంపెనీల అంచనాలు 5–15 శాతం మేర తగ్గొచ్చు’’ అని టెక్‌ఆర్క్‌ సంస్థ వ్యవస్థాపకుడు ఫైసల్‌కవూస తెలిపారు. ధరలు 3–5% వరకు పెరగొచ్చని చెప్పారు. చైనా నుంచి భారత్‌కు విడిభాగాల సరఫరాకు పట్టే సమయం రెట్టింపై 50–60 రోజులకు చేరుకుంది. పండుగల సీజన్‌లో భారీ విక్రయాల ఆకాంక్షలపై తాజా పరిస్థితులు నీళ్లు చల్లుతున్నాయి.

మరిన్ని వార్తలు