ఏప్రిల్‌–జూన్‌లో చైనా వృద్ధి 7.9 శాతం

16 Jul, 2021 03:57 IST|Sakshi

బీజింగ్‌: ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన, వర్థమాన, పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనా ప్రేరిత సవాళ్లను ఎదుర్కొంటుంటే, వైరెస్‌ సృష్టికి కారణమైన చైనా మాత్రం పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2021 రెండవ త్రైమాసికం ఏప్రిల్‌–జూన్‌లో 7.9 శాతం (2020 ఇదే కాలంతో పోల్చి) పురోగతి సాధించింది. మొదటి త్రైమాసికం (జనవరి–మార్చి) 18.3 శాతం వృద్ధితో (1993లో చైనా జీడీపీ గణాంకాల ప్రచురణ ప్రారంభమైంది. అటు తర్వాత ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో వృద్ధి రేటు నమోదుకావడం అదే తొలిసారి) పోల్చితే తాజా గణాంకాలు మందగించడం గమనార్హం.

ఏడాది తొలి ఆరు నెలల్లో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ– చైనా 12.7 శాతం వృద్ధి నమోదుచేసుకున్నట్లు నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) గురువారం గణాంకాలు వెల్లడించాయి. విలువలో ఎకానమీ 53.2 ట్రిలియన్‌ యువాన్‌లకు చేరింది. డాలర్లలో ఇది దాదాపు 8.23 ట్రిలియన్లు.  కాగా త్రైమాసికంగా చూస్తే, మొదటి త్రైమాసికంకన్నా, రెండవ త్రైమాసికంలో వృద్ధి 1.3 శాతంగా ఉంది. గణాంకాల ప్రకారం వార్షికంగా పారిశ్రామిక ఉత్పత్తి 15.9 శాతం పెరిగితే, రిటైల్‌ విక్రయాలు 23 శాతం ఎగశాయి. పట్టణ నిరుద్యోగం జూన్‌లో 5 శాతంగా ఉంది.

ప్రపంచం కష్టపడుతున్న సమయంలో... 
కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో 2020 తొలి త్రైమాసికం మినహా మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం.  కరోనా సవాళ్లతో 2020 మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు (2019 ఇదే కాలంతో పోల్చి) జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్‌ (ఏప్రిల్‌–జూన్‌)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది.  వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెపె్టంబర్‌ మధ్యా  ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో భారీగా 6.5 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 2.3 శాతం వృద్ధి రేటును (జీడీపీ విలువ 15.42 ట్రిలియన్‌ డాలర్లు) నమోదుచేసుకుంది. 

మరిన్ని వార్తలు