ఎవర్‌గ్రాండ్‌ షేర్లు ఢమాల్‌.. గ్లోబల్‌ మార్కెట్‌లో వణుకు! చైనాలో భారీ కార్పొరేట్‌ పతనం తప్పదా?

21 Oct, 2021 12:40 IST|Sakshi

China Evergrande shares fall: కరోనా సవాళ్లకు తోడు రియల్టీ రంగం సంక్షోభంతో  ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (చైనా) మందగమనంలో ఉంది. ఈ తరుణంలో తాజాగా మరో భారీ పతనం చైనాను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరు దక్కించుకున్న ఎవర్‌గ్రాండ్‌.. డిఫాల్టర్‌ మరకను అంటించుకునే టైం దగ్గర పడింది.


చైనా ప్రాపర్టీ దిగ్గజం ‘ఎవర్‌గ్రాండ్‌’(ఎవర్‌గ్రాండే) షేర్లు భారీగా పతనం అయ్యాయి. పదిహేడు రోజుల విరామం అనంతరం.. గురువారం ఉదయం హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో 14 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎవర్‌గ్రాండ్‌..  యూనిట్‌లలో ఒకదానిని 2.6 బిలియన్‌ డాలర్లకు అమ్మేయాలనుకున్న ప్రయత్నం విఫలం అయ్యింది. దీంతో షేర్లు ఒక్కసారిగా పతనం అవుతున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో వణుకు పుట్టిస్తోంది. ఈ ప్రభావంతో  గృహ నిర్మాణ రంగం మందగమనంలో కూరుకుపోయి ప్రపంచవ్యాప్తంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గవచ్చనే ఆందోళనలు అధికమయ్యాయి.

ఎవర్‌గ్రాండే ప్రాపర్టీస్‌ సర్వీసెస్‌లో 51 శాతం భాగాన్ని.. హోప్‌సన్‌ డెవలప్‌మెంట్‌ హోల్డింగ్స్‌కు అమ్మాలనుకున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనుకుంటున్నట్లు బుధవారం అధికారికంగా ఒక ప్రకటన చేసింది కూడా. అయితే హోప్‌సన్‌ డెవలప్‌మెంట్‌ మాత్రం ఎవర్‌గ్రాండ్‌ విధించిన తలాతోకలేని షరతుల వల్లే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం.   

చైనాకు చెందిన అతిపెద్ద(రెండవ) రియల్ ఎస్టేట్ డెవలపర్..  గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ఉండేది. సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్‌ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్‌ డాలర్లవడ్డీని  చెల్లించలేనని ఎవర్‌గ్రాండ్‌ కిందటి నెలలో ప్రకటించడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు 305 బిలియన్‌ డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు నిర్ధారణ కావడంతో రియల్టీ రంగం ఉలిక్కిపడింది. అయితే ఈ సంక్షోభాన్ని తాము తట్టుకుని నిలదొక్కుకుంటామన్న ఎవర్‌గ్రాండ్‌ ఫౌండర్‌ క్జూ జియాయిన్‌(హుయి కా యాన్‌) హామీ ఫలించడం లేదు.  


తాజాగా షేర్లు భారీగా పడిపోతుండడంతో.. చైనాలో అతిపెద్ద కార్పొరేట్ పతనం తప్పదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే గ్లోబల్‌ మార్కెట్‌ కుదేలు కావడం ఖాయం. ఇక ఎవర్‌గ్రాండే షేర్లు చివరిగా 2010 మేలో కనిష్ట స్థాయిలో ట్రేడ్‌ కాగా.. ఇప్పుడు అంతకు మించే పతనం కావడం మరో విశేషం.  

షెంజెన్‌ కేంద్రంగా చైనా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రెండో స్థానంలో ఉన్న ఎవర్‌గ్రాండే.. పోయిన నెలలో పెద్ద  షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే డిఫాల్టర్‌ జాబితాలో చేరాల్సి ఉండగా.. అది కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.  షేర్ల పతనంతో కుదేలు అవుతున్న తరుణంలో..  కొత్త సమస్యను ఎదుర్కొంటోంది.  బకాయిల్లో 83.5 మిలియన్‌ డాలర్ల చెల్లింపులు చేపట్టాలని 30 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే. ఒకవేళ అది జరగకుంటే ఎవర్‌గ్రాండ్‌ను  డిఫాల్టర్‌గా ప్రకటిస్తారు. 

ఘనం నుంచి పతనం
ఎవర్‌గ్రాండ్‌..  1996 చైనాలో అర్బనైజేషన్‌ ఉవ్వెత్తున్న కొనసాగిన టైంలో ఏర్పాటైన రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌.  2009లో 722 మిలియన్‌ డాలర్ల ఐపీవో ద్వారా హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది.  ఆపై 9 బిలియన్‌ డాలర్లతో చైనాలోనే అతిపెద్ద ప్రైవేట్‌ ప్రాపర్టీ కంపెనీగా అవతరించింది. అంతేకాదు వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్‌(హుయి కా యాన్‌) ను అపర కుబేరుడిగా మార్చేసింది. 2010లో గువాన్‌గ్జౌ ఫుట్‌బాల్‌ టీం కొనుగోలు చేయడం, టూరిజం రిక్రియేషన్‌ వ్యాపారాలతోనూ వార్తల్లోకి ఎక్కింది. వాటర్‌ బాటిల్స్ తయారీ, ఈవీ తయారీ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. అయితే కిందటి ఏడాది అగష్టులో ప్రభుత్వం డెవలపర్స్‌ మీద ఉక్కుపాదం మోపడం, అడ్డగోలు డిస్కౌంట్‌లతో అమ్మకాల నుంచి ఎవర్‌గ్రాండ్‌ పతనం మొదలైంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. డిఫాల్ట్‌ గండం నుంచి ఎవర్‌గ్రాండ్‌ బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు.

- సాక్షి, వెబ్‌స్పెషల్‌

మరిన్ని వార్తలు