5జీ నెట్ వ‌ర్క్...ముందు నుయ్యి వెనుక గొయ్యి

13 Aug, 2021 12:35 IST|Sakshi

మనదేశంలోని టెలికాం కంపెనీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ టెక్‌ లవర్స్‌ సైతం 5జీ టెక్నాలజీ వినియోగంపై ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న 4జీ కంటే 5జీ వినియోగం వల్ల టెక్నాలజీతో పాటు అన్నీరంగాల్లో అభివృద్ధి సాధిస్తాయని టెక్‌ నిపుణుల చెబుతున్నారు. కానీ 5జీ నిర్మాణం అంతసాధ్యం కాదని, భారీ ఇన్వెస్ట్‌మెంట్‌లు పెడితే కానీ లాభాలు చవిచూడలేమన్నది దేశీ టెలికాం మాట. మరోవైపు 5జీ టెక్నాలజీలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెడితే  ఖచ్చితంగా లాభాలు వస్తాయని చైనా టెలికాం గణాంకాలు చెబుతున్నాయి. 

వరల్డ్‌ వైడ్‌గా మిగిలిన దేశాల్లోకంటే చైనా 5జీ వినియోగంలో ముందంజలో ఉంది. తాజాగా బ్లూంబెర్గ్‌ రిపోర్ట్‌ ప్రకారం చైనా ప్రభుత్వానికి చెందిన చైనా మొబైల్‌ లిమిటెడ్‌ కంపెనీ మొద‌టి ఆరునెల‌ల్లో 5జీ  వినియోగం వల్ల  6శాతం లాభాల్ని మూటగట్టుకుంది. ఈ ఏడాది నిక‌ర ఆదాయం జనవరి నుంచి జులై మధ్య కాలంలో 59.1 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. నిర్వహణ ఆదాయం 13.8శాతానికి పెరిగింది. ఆ కంపెనీ స్టాక్ వ్యాల్యూ 1.53 యువాన్లు ఉండ‌గా ఇప్పుడు 1.63 యూవాన్ల‌కు పెరిగింది. 5జీలో లాభాలు అధికంగా ఉండటంతో ఇటీవల అమెరికా స్టాక్ ​ఎక్సేంజీలో బహిష్కరణకు గురైన మూడు టెలికాం కంపెనీలు ఇప్పుడు 5జీపై పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 5జీలో లాభాలు ఎంతగా ఉన్నాయనేందుకు ఈ పెట్టుబడుల ప్రవహామే ఓ ఉదాహరణ.

డ్రాగ‌న్ కంట్రీలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తుంటే భార‌త్ టెలికాం కంపెనీలు మాత్రం పెట్టుబ‌డులు పెట్టేందుకు వెన‌క‌డుగు వేస్తున్నాయి. అందుకు కార‌ణం 4జీ నెట్ వ‌ర్క్ లో భారీగా న‌ష్టాలు రావ‌డమే. ఒక్క జియో మినహాయించి మిగిలిన ఎయిర్‌టెల్‌, ఒడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కు న‌ష్టాలు వెంటాడుతున్నాయి. అయితే పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా టెలికాం శాఖ మాత్రం 2022నాటికి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5జీ నెట్ వ‌ర్క్‌ని అందుబాటులోకి తెస్తామ‌ని చెప్పింది. మ‌రో 4,5ఏళ్లు 4జీ నెట్ వ‌ర్క్ అందుబాటులోకి ఉంటుంద‌ని కాబ‌ట్టి.. ఈలోపే 5జీ స్పెక్ట‌మ్ ను వేలం వేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. టెలికాం సంస్థ‌లు మాత్రం వేలంలో తామున్నామంటూ హింట్ ఇస్తున్నా..వేల‌కోట్ల‌లో అప్పులున్న ఐడియా, వొడాఫోన్ లాంటి సంస్థ‌లు 5జీ వ‌ల్ల ఏ మేర‌కు లాభాలు గ‌డిస్తాయ‌న్న‌ది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

చదవండి : గుజరాత్‌లో జర్మన్‌ బ్యాంక్‌, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?!

మరిన్ని వార్తలు