భారత్‌ దెబ్బకు చైనా డౌన్‌, అయినా వక్రబుద్ధి.. భారత్‌ను బద్నాం చేసే కుట్ర!

4 Dec, 2021 10:18 IST|Sakshi

China Suspends Energy Projects In Sri Lanka: డ్రాగన్‌ కంట్రీ మరోసారి భారత్‌పై తన అక్కసును ప్రదర్శించింది. భారత్‌ పేరును ప్రస్తావించకుండా.. అంతర్జాతీయ సమాజంలో బద్నాం చేసే కుట్రకు తెర తీసింది. ఈ మేరకు శ్రీలంక తీరం వెంట నిర్మించతలబెట్టిన భారీ ప్రాజెక్టునొకదానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. భారత్‌ తీరుపై ఆగ్రహం ప్రదర్శించింది చైనా. అయితే ఈ వ్యవహారంలో అంతిమంగా పైచేయి మాత్రం భారత్‌దే కావడం విశేషం. 


చైనాకు చెందిన సినో సోర్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ కంపెనీ, శ్రీలంక జాఫ్నా తీరం వెంబడి డెల్ఫ్ట్‌, నాగాదీప, అనల్‌థివు దీవుల్లో హైబ్రిడ్‌ రెనెవబుల్‌ ఎనర్జీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని జనవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రాజెక్టును ఇప్పుడు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బయటి దేశం నుంచి భద్రతా పరమైన సమస్యలు ఎదురుకావొచ్చనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టను రద్దు చేస్తున్నట్లు గురువారం సినో సోర్‌ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. 

భారత్‌ అభ్యంతరం మేరకే..
వాస్తవానికి చైనా ఏర్పాటు చేయాలనుకుంటున్న దీవుల సముదాయ ప్రాంతం తమిళనాడుకు దగ్గర్లో ఉంది. అందుకే ఈ ప్రాజెక్టును అనౌన్స్‌ చేసిన సమయంలోనే భారత్‌ నిరసన గళం గట్టిగానే వినిపించింది. కొసమెరుపు ఏంటంటే.. లంక ప్రభుత్వం కూడా తొలుత ఈ ప్రాజెక్టును వ్యతిరేకించినా.. సెయిలోన్‌ బోర్డు(CEB), ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలోని ప్రాజెక్టు కావడంతో సైలెంట్‌ అయ్యింది. కానీ, భారత్‌ మాత్రం ఏడాదిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే వస్తోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి చైనాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు. అయితే ఇంత జరిగినా భారత్‌ను బద్నాం చేయాలనే కుట్రను మాత్రం చైనా ఆపలేదు. లంకతో ఒప్పందాల విషయంలో బయటి దేశం జోక్యం ఎక్కువైందని, పైగా ఆ దేశం వల్ల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందంటూ పరోక్షంగా భారత్‌ను తెరపైకి తెచ్చింది. ఇదే ప్రాజెక్టును మాల్దీవుల సముదాయంలో నిర్మించబోతున్నట్లు సినో సోర్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ కంపెనీ పేర్కొంది.

ఇదిలా ఉంటే శ్రీలంకలో భారీ ప్రాజెక్టుల కోసం చైనా అంతేభారీగా పెట్టుబడులు పెట్టింది. 2017లో హంబాన్‌టోటా పోర్ట్‌ను అప్పుల నుంచి బయటపడేందుకు 1.2 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు 99 ఏళ్లపాటు చైనాకు లీజ్‌కు ఇచ్చింది లంక. ఇక గతంలో కొలంబో పోర్ట్‌ కంటెయినర్‌ టెర్మినల్‌ అభివృద్ధి కోసం భారత్‌-జపాన్‌లతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న శ్రీలంక.. కారణాలేంటో చెప్పకుండా ఒప్పందం రద్దు చేసుకుని చైనాతో తిరిగి ఒప్పందం చేసుకుంది. ఇవేగాక వివాదాస్పద బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌ (BRI)లో ప్రాజెక్టులు చేపడుతుండడంపై ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ వంకతో లంకను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చైనా ప్రొత్సహిస్తోందంటూ అంతర్జాతీయ సమాజం ఆరోపిస్తోంది కూడా.

క్లిక్‌ చేయండి: చైనా ఉత్పత్తులపై చర్యలు తీసుకోకుంటే.. మనకు కష్టమే !

మరిన్ని వార్తలు