‘బ్యాగులు తెచ్చుకోండి.. డబ్బులు నింపుకోండి’, ఉద్యోగులకు బంపరాఫర్‌

31 Jan, 2023 13:24 IST|Sakshi

ప్రపంచ దేశాల్ని ముందస్తు ఆర్ధిక మాద్యం భయాలు వెంటాడుతున్నాయి. భవిష్యత్‌ పరిణామాలు మరింత కఠినంగా ఉండొచ్చనే ఆర్ధిక నిపుణుల అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్‌ కంపెనీలు పొదుపు - మదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఓ వైపు ఉద్యోగుల్ని తొలగిస్తూ.. ఏ మాత్రం లాభసాటి లేని వ్యాపారాల్ని మూసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ అందుకు భిన్నంగా వ్యవహరిచండం ఆసక్తికరంగా మారింది. 

గత ఏడాది కరోనా కారణంగా పలు కంపెనీలు భారీ ఎత్తున నష్టపోయాయి. అయితే చైనాకు చెందిన ప్రొక్లైన్ల తయారీ సంస్థ హెనాన్‌ మైన్‌ లాభాల్ని గడించింది. అందుకు కారణమైన ఉద్యోగులకు భారీ ఎత్తున బోనస్‌లు ప్రకటించింది. 

ఆ బోనస్‌లను ఉద్యోగుల అకౌంట్‌లలో డిపాజిట్లు చేయకుండా నేరుగా క్యాష్‌ రూపంలో ఇచ్చింది. ఆ క్యాష్‌ తీసుకునేందుకు వచ్చిన ఉద్యోగులు బ్యాగులు పట్టుకు రావడం, వరుసగా పేర్చిన డబ్బుల కుప్పులో నుంచి నోట్ల కట్టల్ని బ్యాగుల్లో వేసుకునే దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఇంతకీ ఉద్యోగులకు ఎంత బోనస్‌ ఇచ్చారో తెలుసా? ఇండియన్‌ కరెన్సీలో ఒక్కో ఉద్యోగికి  కోటిరూపాయలకు పైగా రాగా, అధికంగా  ముగ్గురు రూ.6.4 కో‍ట్ల చొప్పున దక్కించుకోవడం విశేషం.

సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. 
1976 తర్వాత 2022లో చైనా వృద్ధి రేటు భారీగా తగ్గింది. అదే సమయంలో ఉద్యోగుల కష్టార్జితంతో హెనాన్‌ మైన్‌ లాభాల్ని మూటగట్టుకుంది. ప్రతిఫలంగా జనవరి 17న సేల్స్‌ విభాగంలో పనిచేసే 30 మంది ఉద్యోగుల్లో ముగ్గురికి ఒక్కొక్కరికి ఆరు కోట్ల రూపాయల బోనస్ చెల్లించింది. మిగిలిన వారికి రూ.1.20 కోట్లు ఇచ్చింది.  మొత్తంగా రూ.73 కోట్ల రూపాయల నోట్ల కట్టలను ఉద్యోగులు చేతులతో బ్యాగులలో నింపుకొని తీసుకెళుతున్న వీడియోల్ని వీక్షించిన నెటిజన్లు సదరు కంపెనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు