Huawei: భారత్‌కు బైబై..దేశంలో కార్యకలాపాల్ని నిలిపేసిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం

25 Jul, 2022 20:09 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ హువావే భారత్‌కు గుడ్‌ బై చెప్పింది. చైనా స్మార్ట్‌ ఫోన్‌ సంస్థలపై కేంద్రం కఠిన వైఖరిని ప్రదర్శిస్తుంది. ఈ తరుణంలో హువావే సబ్‌ బ్రాండ్‌ హానర్‌ స్మార్ట్‌ఫోన్‌ కార్యకాలాపాల్ని భారత్‌లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం..మా కంపెనీ అన్నీ నిబంధనలకు లోబడే స్థానిక భాగస్వాములతో కలిసి భారత్‌లో కార్యకాలాపాల్ని నిర్వహిస్తుంది. కానీ స్పష్టమైన కారణాల్ని హైలెట్‌ చేస్తూ భారత్‌లో తన వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు హానర్ సీఈఓ ఝావో మింగ్ తెలిపారు. కానీ ఆ స్పష్టమైన కారణలు ఏంటనేది చెప్పే ప్రయత్నం చేయలేదు.  

ఈడీ దెబ్బ.. హువావే అబ్బా
ఇటీవల కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చైనా దిగ్గజ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలైన వివో, ఒప్పో, షావోమీలపై దాడులు, దర్యాప్తులు నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో హువావే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. 

అమెరికాలో సైతం 
2018లో హానర్‌ భారత్‌లో ౩ శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అదే సమయంలో హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తరువాత అక్కడ సైతం మార్కెట్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీ అమెరికాలో వ్యాపారాన్ని నిర్వహించేందుకు కష్టంగా మారింది. అందుకే హువావే గతేడాది నవంబర్‌లో తన హానర్ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన ఆస్తుల్ని చైనాకు చెందిన షెన్జెన్ జిక్సిన్ న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అమ్మేసింది.

>
మరిన్ని వార్తలు