స్మార్ట్‌ఫోన్‌ ఆధిపత్యానికి చెక్‌! చైనాను ఇరకాటంలో నెట్టేలా భారత్‌ నిర్ణయం

18 Oct, 2021 14:32 IST|Sakshi

Indian Government Regulation To Prevent Handset Snooping: పొరుగు దేశం చైనాకు భారత్‌ భారీ షాక్‌ ఇచ్చింది. భారత మార్కెట్‌ను శాసిస్తున్న..  చైనా బ్రాండ్‌ ఫోన్ల విషయంలో ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వివో, ఒప్పో, షావోమీ, వన్‌ఫ్లస్‌ కంపెనీలను పరిశీలన విభాగం కిందకు తీసుకొచ్చి మరీ నోటీసులు పంపించింది. 


ఇప్పటి నుంచి చైనా నుంచి దిగుమతి అయ్యే స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను భారత్‌కు సమర్పించాల్సి ఉంటుంది. అంటే.. సదరు బ్రాండ్‌ ఫోన్లలో ఎలాంటి కంపోనెంట్లు ఉపయోగిస్తున్నారో లాంటి పూర్తి వివరాల్ని సైతం వెల్లడించాల్సిందేనని(చైనా ఇంతవరకు చేయని పనే ఇది!.. ఈ విషయంలో పలు దేశాలకూ అనుమానాలున్నాయి) నోటీసుల్లో భారత్‌ పేర్కొంది. అంతేకాదు సెక్యూరిటీ కారణాల వల్ల ప్రీ ఇన్‌స్టాల్‌ యాప్స్‌ తదితర వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఇదంతా నిఘా కోణంలో భాగంగానే తీసుకున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌లోని కన్జూమర్లకు ఆ ప్రొడక్టులు సురక్షితమైనవేనా? కాదా? అనేది తేల్చుకోవాల్సిన అవసరం తమకు ఉందని ఈ సందర్భంగా భారత ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొన్నట్లు ది మార్నింగ్‌ కంటెక్స్ట్‌ ఓ కథనం ప్రచురించింది.

కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ డాటా ప్రకారం.. మన దేశపు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో పైన పేర్కొన్న ఫోన్ల కంపెనీల ఆధిపత్యమే 50 శాతం దాకా కొనసాగుతోంది.

భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని తరుణంలో.. కిందటి ఏడాది ఒక్కసారిగా 220 చైనా యాప్‌ల్ని నిషేధించి పెద్ద దెబ్బ కొట్టింది కేంద్ర ప్రభుత్వం. యాప్‌ల ద్వారా రహస్యాలను, వ్యక్తిగత డాటాను సేకరిస్తుందనే ఆరోపణల మీద ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.  అప్పటి నుంచి ‘లోకల్‌నెస్‌’ ప్రదర్శించుకోవడం కోసం స్థానిక ఉత్పత్తి దిశగా అడుగులు ప్రారంభించాయి కొన్ని కంపెనీలు. కానీ, కేంద్రం మాత్రం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా..  ఇప్పుడు ఫోన్ల ద్వారా రహస్యాల సేకరణకు ఆస్కారం ఉన్నందున స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ నియంత్రణకు సిద్ధపడడం విశేషం.
 

చదవండి: చైనాతో కచ్చి.. బిజినెస్‌ మాత్రం బిలియన్లలో!

మరిన్ని వార్తలు