‘భారత్‌కు గుడ్‌ బై’, దేశం నుంచి తరలి వెళ్లిపోతున్న చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు!

18 Sep, 2022 09:23 IST|Sakshi

భారత్‌లో కార్యకలాపాల నుంచి వైదొలగుతున్న విదేశీ సంస్థల జాబితా పెరిగిపోతుంది. మార్కెట్‌లో దేశీయ కంపెనీలతో పోటీ పడలేక, ఇక్కడి చట్టాల్ని యేథేచ్ఛగా ఉల్లంఘించినా ఏం కాదులే అనే ధీమా తగ్గడంతో దేశీయ మార్కెట్‌కు గుడ్‌ బై చెబుతున్నాయి. తమ వ్యాపార నిర్వహణకు అనువైన దేశాల వైపు మొగ్గు చూపుతున్నాయి. 

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. భారత్‌కు గుడ్‌బై చెప్పి ఇండోనేషియా, బంగ్లాదేశ్‌, నైజీరియాలలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ కథనాల్ని ప్రచురించింది.  

మేడిన్‌ ఇండియా 
‘భారత్‌ దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థల్ని ప్రోత్సహించేందుకు మా పట్ల (చైనా కంపెనీలు) కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ తరహా ధోరణి స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలపై ఎక్కువగా ఉంది’ అంటూ భారత్‌లో చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలకు చెందిన ప్రతినిధులు చెప్పారంటూ గ్లోబల్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది.అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒప్పో ఈజిప్ట్‌లో మ్యానిప్యాక్చరింగ్‌ యూనిట్‌ను ప్రారంభించనుంది.    

ఈజిప్ట్‌లో ఒప్పో
చైనా సంస్థ ఒప్పో ఈజిప్ట్‌లో మ్యానిప్యాక్చరింగ్‌ యూనిట్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఫోన్‌ల తయారీ ప్లాంటు కోసం సుమారు 20 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా రానున్న సంవత్సరాల్లో సుమారు 900 ఉద్యోగాల రూప కల్పన జరనున్నట్లు ఈజిప్ట్‌ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.


చదవండి👉 బంపరాఫర్‌ ..ఏకంగా 80 శాతం డిస్కౌంట్!


పన్ను ఎగొట్టి
2021 డిసెంబర్‌ నెలలో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడి చైనాలో తన పేరెంట్‌ కంపెనీలకు అక్రమంగా నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చైనా స్మార్ట్‌ఫోన్‌ సంస్థ షావోమీతో పాటు ఇతర చైనా సంస్థల్ని విచారించారు. ఆ విచారణ కొనసాగుతుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అధికారులు షావోమీ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనుకుమార్‌ జైన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.     

ఆ తర్వాత
ఒప్పో, వివో, షావోమీతో పాటు ఇతర కంపెనీలు మనీ ల్యాండరింగ్‌ (Prevention of Money Laundering Act (PMLA) యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలతో 2022 జులైలో  ఈడీ అధికారులు చైనా సంస్థ వివో తో పాటు ఇతర సంస్థలకు చెందిన  ఢిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌, మేఘాలయా, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌.. ఇలా మొత్తం 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

వేల కోట్లు  
ఆ సమయంలో వివో  మోసాలను ఈడీ బయటపెట్టింది. వివో కంపెనీ భారత్‌లో పన్నులు ఎగొట్టి టర్నోవర్‌లో దాదాపు 50శాతం నిధులను చైనాకు తరలించిందని, ఆ మొత్తం 2017 నుంచి 2021 మధ్య కాలంలో మొత్తం రూ.62,476కోట్లు ఉందని వెల్లడించింది.వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఒప్పో కూడా పన్నులు ఎగ్గొట్టినట్లు బయటపడింది. ఒప్పో సంస్థ రూ. 4389 కోట్ల వరకు కస్టమ్‌ డ్యూటీ ఎగవేసింది. వస్తువుల విలువను తక్కవ చేసి చూపించడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడింది. మరో కంపెనీ షావోమి కూడా రూ. 653 కోట్లు ఎగవేతకు పాల్పడింది. ఈ మూడు సంస్థలకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. ఈ తరుణంలో భారత్‌కు చైనా కంపెనీలు గుడ్‌ బై చెప్పడం ఆసక్తికరంగా మారింది.  

చదవండి👉 మీ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి!

మరిన్ని వార్తలు