చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!

17 Feb, 2022 19:16 IST|Sakshi

ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ రోజు రోజుకి మరింత కష్టాల్లో చిక్కుకుంటున్నారు. మరోసారి చిత్రా రామకృష్ణ నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ఆదాయపన్ను, సెబీ సంస్థల విచారణలో చిత్రా రామకృష్ణ ఉన్నారు. ఆమె ఎన్ఎస్ఈ మాజీ సీఈఓగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీనికి తోడు అజ్ఞాత యోగితో చిత్ర జరిపిన ఈ-మెయిల్ సంభాషణలు తాజాగా బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు, ఎవరు ఈమె?, చిత్రా రామకృష్ణపై ఆదాయపన్ను& సెబీ సంస్థలు ఎందుకు విచారణ చేపడుతున్నాయి? అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.

చిత్ర రామకృష్ణ ఎవరు?
చార్టెడ్ అకౌంటెంట్‌గా జీవితం ప్రారంభించిన చిత్రా రామకృష్ణ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఐడీబీఐ బ్యాంకుకు చెందిన ప్రాజెక్ట్ ఫైనాన్స్ డివిజన్లో చేరారు. చిత్ర రామకృష్ణ కాలక్రమేణా ఒక్కో మెట్టు ఎక్కుతూ 2009లో ఎన్ఎస్ఈకి మేనేజింగ్ డైరెక్టర్(ఎండి)గా నియామకం కావడం జరిగింది. ఆ తర్వాత 2013లో ఎన్ఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఈఓ) పదివి చేపట్టి 2016 వరకు కొనసాగారు.

చిత్ర రామకృష్ణ కెరీర్
హర్షద్ మెహతా కుంభకోణం తర్వాత ఓ పారదర్శక ట్రేడింగ్ మార్కెట్ నిర్వహించాలని కేంద్రం భావించింది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ఏర్పాటు చేసింది. అందులో ఈమె కీలక సభ్యురాలిగా కొనసాగారు. అక్కడి నుంచి సీఐఐ నేషనల్ కౌన్సిల్ ఆన్ ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్ మెంట్, ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, క్యాపిటల్ మార్కెట్స్ కమిటీ వంటి ఇండస్ట్రీ బాడీ కమిటీల్లో కూడా రామకృష్ణ పని చేశారు. ఆ తర్వాత ఆమె 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్'గా నియమితులయ్యారు. 2013లో ఆమె సీఈఓగా పదోన్నతి పొందింది. 2016లో అనూహ్యంగా ఎన్ఎస్ఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. బోర్డు సభ్యులతో అభిప్రాయ భేదాల కారణంగానే తన పదివికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.  

చిత్ర రామకృష్ణ పతనం
2016లో అనూహ్యంగా ఎన్ఎస్ఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి తొలగిన తర్వాత ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. చిత్ర గత 20 సంవత్సరాలుగా వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలలో హిమాలయాల్లో నివసిస్తున్న ఒక 'యోగి' తనకు మార్గనిర్దేశం చేసినట్లు చెప్పారు. అజ్ఞాత యోగితో చిత్ర జరిపిన ఈ- మెయిల్ సంభాషణలు సెబీ దర్యాప్తులో బయటకు వచ్చాయి. అలాగే, ఆనంద్ సుబ్రమణియన్'ను ప్రధాన వ్యూహాత్మక సలహాదారుగా నియమించడంలోను ఆమెపై ఆరోపణలు వచ్చాయి. హిమాలయన్ 'యోగి' చెప్పినందుకే అతనిని నియమించుకున్నట్లు సీబిఐ దర్యాప్తులో తేలింది.   

పాలనపరమైన విషయంలో కూడా రామకృష్ణ, బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ విషయం వెల్లడైంది. దర్యాప్తులో రామకృష్ణ హిమాలయన్ 'యోగి' గురించి చెబుతూ తనకు రూపం లేదని, తను ఒక ఆధ్యాత్మిక శక్తిగా చెప్పినట్లు సెబీ పేర్కొంది. పాలనా లోపాల విషయంలో సెబీ రామకృష్ణపై రూ.3 కోట్లు, ఎన్ఎస్ఈ మాజీ ఎండి సుబ్రమణియన్, సీఈఓ రవి నరైన్ లపై ఒక్కొక్కరికి రూ.2 కోట్లు, చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్, కాంప్లయన్స్ ఆఫీసర్'గా ఉన్న వి.ఆర్.నరసింహన్ కు రూ.6 లక్షలు జరిమానా విధించింది. 

ఇంకా, రామకృష్ణ & సుబ్రమణియన్లను ఏ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో లేదా సెబీతో రిజిస్టర్ చేసుకున్న సంస్థతో కలిసి పనిచేయకుండా 3 సంవత్సరాల పాటు నిషేదించింది. అలాగే, నరైన్ కు కూడా 2 సంవత్సరాలు నిషేదించింది. అయితే, సెబీ దర్యాప్తులో హిమాలయన్ 'యోగి' ఒక వ్యక్తి అని తేలింది. మరి అతను ఎవరు అనేది ఆనంద్ సుబ్రమణియన్'కు తెలిసి ఉంటుంది అని భావిస్తుంది.

(చదవండి: వీరేంద్ర సెహ్వాగ్, భువనేశ్వర్ కుమార్ భాటలో ఆరోన్ ఫించ్..!)

మరిన్ని వార్తలు