‘మహమ్మారి నిధి’ ఏర్పాటు చేయాలి

19 Jul, 2021 04:57 IST|Sakshi

దీర్ఘకాలిక రిస్కుల నిర్వహణపై సీఐఐ అభిప్రాయం

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 తరహా పరిస్థితులు భవిష్యత్తులో మళ్లీ ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక రిస్కు నిర్వహణ కోసం ’మహమ్మారి నిధి (పూల్‌)’ వంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ తెలిపింది. తొలినాళ్లలో ప్రభుత్వమే దీనికి ఆర్థికపరమైన తోడ్పాటు అందించాలని కోరింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు, వ్యక్తులు అందరి ఆలోచన.. మహమ్మారి రిస్కులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే ఉందని, పూల్‌కి అవసరమైన నిధులను వారి నుంచి కూడా సేకరించడానికి అవకాశం ఉంటుందని సీఐఐ తెలిపింది.

‘తొలినాళ్లలో పూల్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటు అవసరమైనప్పటికీ.. 12–15 ఏళ్లలో మిగులు నిధులు సమకూరే కొద్దీ క్రమంగా ప్రభుత్వ మద్దతును సున్నా స్థాయికి తగ్గవచ్చు‘ అని వివరించింది. మహమ్మారిపరమైన నష్టాలను బీమా కంపెనీలు ఇప్పటిదాకానైతే ఎదుర్కొనగలిగినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఎదుర్కొనాలంటే మరింత భారీ స్థాయిలో మూలనిధి అవసరమవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మహమ్మారి నిధి ఏర్పాటు తోడ్పడగలదని సీఐఐ తెలిపింది. పూల్‌లో కనీసం 5 శాతం నిధిని సమకూర్చుకునేందుకు పాండెమిక్‌ బాండ్ల జారీ అంశాన్ని పరిశీలించవచ్చని, అలాగే దీనికి కేటాయించే నిధులను కంపెనీల సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) వ్యయాలుగా పరిగణించాలని కోరింది. నిధి కోసం వసూలు చేసిన ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మినహాయింపునిచ్చే అంశాన్నీ పరిశీలించవచ్చని సీఐఐ పేర్కొంది.

మరిన్ని వార్తలు