అంచనాలను అందుకున్న సిప్లా

5 Nov, 2022 09:55 IST|Sakshi

క్యూ2 లాభంలో 12 శాతం వృద్ధి  

న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా లిమిటెడ్‌ సెప్టెంబర్‌ త్రైమాసికానికి (202–23లో క్యూ2) బలమైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభంలో 12 శాతం వృద్ధి నమోదైంది. రూ.797 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.709 కోట్లుగా ఉంది. దేశీయ, యూఎస్‌ మార్కెట్లలో బలమైన అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని ఆదాయంతో పోలిస్తే రూ.5,520 కోట్ల నుంచి రూ.5,829 కోట్లకుపెరిగింది. భారత్‌లో ఉన్న అమెరికా వ్యాపారాన్ని బదలాయించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.

ప్రస్తుత వాతావరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. క్యూ2 ఫలితాలపై సిప్లా ఎండీ, గ్లోబల్‌ సీఈవో ఉమంగ్‌ వోహ్రా మాట్లాడారు. యూఎస్‌ మార్కెట్లో వివిధ పోర్ట్‌ఫోలియోల పరంగా అమలు చేసిన విధానం, దేశీ మార్కెట్లో బలమైన పనితీరు ఫలితాల్లో కనిపించినట్టు చెప్పారు. దేశీ అమ్మకాల ఆదాయం 6 శాతం పెరిగి రూ.2,563 కోట్లుగా ఉంటే, నార్త్‌ అమెరికా వ్యాపారం 35 శాతం పెరిగి రూ.1,432 కోట్లకు చేరింది.  

కలిసొచ్చిన లెనలిడోమైడ్‌ 
ముఖ్యంగా లెనలిడోమైడ్‌ డ్రగ్‌ను విడుదల చేయడం అమ్మకాల వృద్ధికి తోడ్పడినట్టు ఉమంగ్‌ వోహ్రా తెలిపారు. వెలుపలి మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ లాభాలను నమోదు చేసినట్టు వివరించారు. నిర్వహణ లాభం 22.3 శాతంగా ఉందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి తమ అంచనాలైన 21–22 శాతం పరిధిలోనే ఇది ఉన్నట్టు వివరించారు. వ్యయాలు తగ్గించుకోవడం, ధరలు పెంచడం తదితర చర్యలతో కమోడిటీ ధరల పెరుగుదల ప్రభావాన్ని కంపెనీ అధిగమించింది.

మరిన్ని వార్తలు