సిప్లా- తేజస్‌ నెట్‌వర్క్స్‌ .. అదుర్స్‌

10 Aug, 2020 11:01 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

8 శాతం దూసుకెళ్లిన సిప్లా లిమిటెడ్‌

52 వారాల గరిష్టానికి షేరు

ఎల్‌అండ్‌టీ కన్‌స్ట్రక్షన్‌ నుంచి ఆర్డర్‌

5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు తేజస్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం సిప్లా లిమిటెడ్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మరోపక్క డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ లిమిటెడ్‌ నుంచి ఆర్డర్‌ను పొందినట్లు బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కంపెనీ తేజస్‌ నెట్‌వర్క్స్‌ వెల్లడించింది. దీంతో రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఫలితంగా భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. సిప్లా లిమిటెడ్‌ షేరు 52 వారాల గరిష్టానికి చేరగా.. తేజస్‌ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం..

సిప్లా లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో సిప్లా నికర లాభం 27 శాతం పెరిగి రూ. 566 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం బలపడి రూ. 4346 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. దేశీ బిజినెస్‌ 10 శాతం వృద్ధితో రూ. 1608 కోట్లకు చేరినట్లు సిప్లా పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు మరింత అధికంగా 64 శాతం జంప్‌చేసి రూ. 457 కోట్లను తాకినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సిప్లా షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లింది. రూ. 793కు చేరింది. ఇది 52 వారాల  గరిష్టం కాగా.. గత 6 నెలల్లో ఈ షేరు 74 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. 

తేజస్‌ నెట్‌వర్క్స్‌
మౌలిక సదుపాయాల దిగ్గజం ఎల్‌అండ్‌టీ కన్‌స్ట్రక్షన్‌ నుంచి GPON ఆధారిత ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రొడక్టుల సరఫరా కోసం ఆర్డర్‌ లభించినట్లు తేజస్‌ నెట్‌వర్క్స్‌ తాజాగా పేర్కొంది. రూ. 66 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌లో భాగంగా గరిష్ట పనితీరు చూపగల మెట్రో ఇథర్‌నెట్‌ స్విచెస్‌ను సైతం సరఫరా చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో తేజస్‌ నెట్‌వర్క్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 64 సమీపంలో ఫ్రీజయ్యింది.

మరిన్ని వార్తలు