చెప్పిందే చేశా: డోజీ లోగోపై మస్క్‌వివరణ, నెటిజన్ల మీమ్స్‌ వైరల్‌

4 Apr, 2023 15:18 IST|Sakshi

సాక్షి, ముంబై: ట్విటర్‌ బాస్‌ ఎలాన్ మస్క్‌ అనూహ్యంగా లోగోను మార్చడం పెద్ద దుమారాన్ని లేపింది.    ట్విటర్‌కు ఇప్పటిదాకా ఉన్న బ్లూ బర్డ్​ లోగోను స్థానంలో  అకస్మాత్తుగా  వచ్చిన ‘డోజీ ’ లోగోను చూసి  నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. మరోవైపు  లోగో ఇలా మార్చాడో  లేదో  మస్క్‌ మద్దతున్న క్రిప్టో కరెన్సీ Dogecoin దాదాపు 30 శాతం పెరిగింది. దీంతో  ట్విటర్‌లో  నాన్‌స్టాప్‌ మీమ్స్‌తో సందడి చేశారు.
 
ఇది ఇలా ఉంటే క్లాసిక్‌ బర్డ్‌లోగోమార్చడంపై ఎలాన్‌ మస్క్‌ వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.    వాగ్దానం చేసినట్టుగానే అంటూ ఈ సందర్బంగా 2022, మార్చి 26 నాటి పాత చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్‌ చేశాడు. అందులో ఓ యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను డాగ్ గా మార్చాలని అడగడాన్ని మనం గమనించావచ్చు. ఈ క్రమంలో అప్పుడు చెప్పినట్టు ట్విటర్ లోగోను మార్చినట్టు చెప్పాడు. అంతేకాదు పనిలో పనిగా  ఇక ఆపండి అబ్బాయిలూ అంటూ మీడియాపై సెటైర్లు కూడా వేశాడు. అయితే ఈ లోగో శాశ్వతంగా ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. 

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సీఈవో అయినఎలాన్ మస్క్  గత ఏడాది నవంబర్‌లో 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేశాడు.  కొత్త బాస్‌గా ట్విటర్‌.2లో అనేక కీలక మార్పులతో వార్తల్లో నిలిచాడు మస్క్‌. సీఈవో సహా ఇతర కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగింపు మొదలు, ట్విటర్‌ బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ ఫీజు దాకా ప్రతీ మార్పుతో  తనదైన శైలిని చాటుకుంటున్నాడు మస్క్‌. జపాన్ జాతికి చెందిన ‘షిబా ఇనూ’ అనే కుక్క ఫొటోనే డోజీగా పిలుస్తుంటారు. 2013 లో మొదటి సారి డోజీకాయిన్ క్రిప్టో కరెన్సీకి  డోజీని లోగోగా క్రియేట్‌ చే'సిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు