కరోనా దెబ్బకు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

19 Apr, 2021 16:14 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీగా పతనమయ్యాయి. కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూలు అమలు చేయడంతో మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో బెంచ్ మార్క్ సూచిలు దాదాపు 2 శాతం నష్టాల్లో ముగిశాయి. ఉదయం 47,940 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 1,470 పాయింట్లు కుప్పకూలి చివరకు సెన్సెక్స్‌ 882 పాయింట్లు కోల్పోయి 47,949 వద్ద ముగిసింది. ఇక 14,306 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన నిఫ్టీ కూడా 258 పాయింట్లు నష్టపోయి 14,359 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.85 వద్ద నిలిచింది.

బ్యాంకింగ్, ఎనర్జీ, ఆటో స్టాక్స్ సూచీలు నష్టాల్లో ముగియగా.. ఫార్మా స్టాక్స్ మాత్రమే లాభాలు నమోదు చేశాయి. నిఫ్టీలో ఫార్మా మినహా అన్ని రంగాలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ బలంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 2,73,810 కేసులు వెలుగు చూశాయి. మరో 1,619 మంది ప్రాణాలు వదిలారు. కేసుల ఉద్ధృతితో అప్రమత్తమవుతున్న రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. 

చదవండి: 

బ్లాక్‌ మండే: సుమారు 6 లక్షల కోట్ల సంపద హాంఫట్

మరిన్ని వార్తలు