వరుసగా నాల్గవ రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!

1 Oct, 2021 16:03 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గవ రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచిలపై అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల సూచీల స్థిరీకరణ మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అలాగే సహజవాయువు, సీఎన్‌జీ, ఎల్‌పీజీ ధరలు సైతం పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను వెంటాడాయి. దీంతో మార్కెట్ నాలుగో రోజు నష్టపోయింది. చివరికి, సెన్సెక్స్ 360.78 పాయింట్లు (0.61%) క్షీణించి 58,765.58 వద్ద ముగిసింది. నిఫ్టీ 86.20 పాయింట్లు (0.49%) కోల్పోయి 17,532.00 వద్ద స్థిరపడింది. 

సుమారు 1716 షేర్లు అడ్వాన్స్ అయితే, 1373 షేర్లు క్షీణించాయి, 150 షేర్లు మారలేదు. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 74.10గా ఉంది. నిఫ్టీలో బజాజ్ ఫిన్ సర్వ్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్ టెల్ షేర్లు ఎక్కువగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఎంఅండ్ఎం, కోల్ ఇండియా, ఐఓసి, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఒఎన్‌జిసీల షేర్లు భారీగా లాభపడిన వాటిలో ఉన్నాయి. ఫార్మా, మెటల్, పిఎస్‌యు బ్యాంక్, ఇంధన రంగాల షేర్లు కొనుగోలు చేస్తే.. రియాల్టీ, బ్యాంక్, ఐటీ రంగాలలో అమ్మకాలు కనిపించాయి.(చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!)


 

మరిన్ని వార్తలు