క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో కాల్‌ డ్రాప్స్‌కు చెక్‌

3 Mar, 2023 06:06 IST|Sakshi

హెచ్‌సీఎల్‌ టెక్‌ సీటీవో కల్యాణ్‌ కుమార్‌

బార్సెలోనా: కాల్‌ అంతరాయాల (డ్రాప్స్‌) సమస్య పరిష్కారించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు మూడు ఉన్నాయని హెచ్‌సీఎల్‌ టెక్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ కల్యాణ్‌ కుమార్‌ తెలిపారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఆధారిత టెలికం నెట్‌వర్క్, ఇళ్లకు చేరువలో ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం, నెట్‌వర్క్‌ను వర్చువల్‌ విధానానికి మార్చడం ఇందుకు సహాయపడగలదని ఆయన పేర్కొన్నారు. మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కుమార్‌ ఈ విషయాలు వివరించారు.

కరోనా మహమ్మారి తర్వాత డేటాకు డిమాండ్‌ గణనీయంగా పెరిగిందని, టెల్కోలు తమ నెట్‌వర్క్‌ల నిర్వహణ కోసం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్స్‌ వైపు మళ్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నోకియా మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం భారత్‌లో గత అయిదేళ్లలో మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ 3.2 రెట్లు పెరిగింది. అయితే, టెల్కోల నెట్‌వర్క్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగం ఆ స్థాయిలో పెరగలేదని కుమార్‌ చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ను, క్లౌడ్‌ సాంకేతికతలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కాల్‌ డ్రాప్‌ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు