ఓటీటీలకూ భారీ షాక్‌.. ఇకపై అలా కుదరదండి!

26 Oct, 2022 04:00 IST|Sakshi

టెల్కోల డిమాండ్‌

న్యూఢిల్లీ: కమ్యూనికేషన్‌ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్‌ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్‌–ది–టాప్‌) కమ్యూనికేషన్‌ యాప్స్‌కు కూడా వర్తింపచేయాలని కోరింది. అలా చేయని పక్షంలో తమ లైసెన్సులు, నియంత్రణపరమైన నిబంధనలనైనా సడలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అన్ని ‘ఓటీటీ కమ్యూనికేషన్‌ సేవల విషయంలో అన్ని టెక్నాలజీలకు సమానంగా రూల్స్‌ను అమలు చేయాలి.

తద్వారా పరిశ్రమలో సముచితమైన, ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది‘ అని ఒక ప్రకటనలో సీవోఏఐ పేర్కొంది. ఓటీటీ కమ్యూనికేషన్‌ సర్వీసులను కూడా ఇటీవలి టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు ముసాయిదాలో పొందుపర్చడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ తరహా సేవల విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని కోరుకుంటున్నామని వివరించింది.
  

టెలికం సంస్థలు స్పెక్ట్రం కొనుగోలు చేయం మొదలుకుని నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకోవడం వరకూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, అనేక నిబంధనలను పాటించాల్సి ఉంటోందని సీవోఏఐ తెలిపింది. మరోవైపు ఓటీటీలు మాత్రం టెలికం సర్వీసులను ఇలాంటి బాదరబందీలేమీ లేకుండా, ఎలాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేకుండా అందించడం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొంది. సీవోఏఐలో టెలికం సంస్థలు రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా మొదలైనవి సభ్యులుగా ఉన్నాయి. వాట్సాప్‌ వంటి ఓటీటీ కమ్యూనికేషన్‌ యాప్‌లు .. ఇంటర్నెట్‌ టెక్నాలజీ ఆధారంగా టెలికం సంస్థల తరహాలోనే వాయిస్, వీడియో కాలింగ్‌ సేవలను అందిస్తున్నాయి.  ­

చదవండి: షాపింగ్‌ బంద్‌, యూపీఐ లావాదేవీలు ఢమాల్‌.. ఏమయ్యా విరాట్‌ కోహ్లీ ఇదంతా నీ వల్లే!

మరిన్ని వార్తలు