కనీస ధరల పెంపు పై ట్రాయ్‌కి సీవోఏఐ విజ్ఞప్తి

5 Aug, 2021 08:06 IST|Sakshi

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం రంగం గట్టెక్కాలంటే కనీస ధరలు (ఫ్లోర్‌ ప్రైస్‌) నిర్ణయించడం అత్యంత కీలకమని టెల్కోల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. తాత్కాలికంగా రెండేళ్ల పాటు అయినా కేవలం డేటాకు ఫ్లోర్‌ ప్రైస్‌ నిర్ణయించాలని, వాయిస్‌ కాల్స్‌కు మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చని తెలిపింది. సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచర్‌ ఒక ప్రకటనలో ఈ విషయాలు పేర్కొన్నారు.
 
మహమ్మారి కాలంలో ఆర్థికంగా సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రజలకు నిరంతరాయంగా నెట్‌వర్క్‌ కనెక్టివిటీ అందించేందుకు టెలికం సంస్థలు గణనీయంగా పెట్టుబడులు పెట్టడం కొనసాగించాయని కొచర్‌ తెలిపారు. డేటా టారిఫ్‌ల తగ్గింపు ధోరణుల వల్ల టెల్కోలు భారీగా నష్టపోయిన సంగతి గుర్తించాలని, కంపెనీలు ఆర్థికంగా కోలుకోవాలంటే ఆదాయాన్ని పెంచుకోవడం అత్యంత కీలకంగా మారిందని ఆయన వివరించారు. కనీస ధరలను నిర్ణయించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి సీవోఏఐ పలుమార్లు విజ్ఞప్తి చేసిందని, దీనిపై చర్చలు కూడా జరిగాయని కొచర్‌ పేర్కొన్నారు. రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా తదితర సంస్థలకు సీవోఏఐలో సభ్యత్వం ఉంది.

పెరిగే అవకాశం?
మరోవైపు, టెలికం రంగంలో తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో టారిఫ్‌లు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ఇటీవలే వ్యాఖ్యానించారు. అటు వొడాఫోన్‌ ఐడియా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతోంది. ఏజీఆర్‌ (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, మారటోరియంపై స్పష్టతనిస్తే తప్ప ఇన్వెస్ట్‌ చేసేందుకు మదుపరులెవరూ ముందుకు వచ్చేలా లేరంటూ కంపెనీ జూన్‌ 7న కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఏజీఆర్‌ బాకీల కింద వొడాఫోన్‌ ఐడియా రూ. 58,254 కోట్ల మేర బాకీపడింది. ఇందులో రూ. 7,854 కోట్లు కట్టగా మరో రూ.50,399 కోట్లు కట్టాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాల్‌ ఛార్జీల సంగతేమోగానీ.. డేటా ఛార్జీలు మాత్రం గణనీయంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు