స్పెక్ట్రం బేస్‌ ధరపై టెలికాం సంస్థల పేచీ

29 Nov, 2021 09:03 IST|Sakshi

స్పెక్ట్రం బేస్‌ ధర సగానికి పైగా తగ్గించమంటూ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ప్రతిపాదిత 5జీ స్పెక్ట్రం బేస్‌ ధరను సగానికి పైగా తగ్గించాలని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ.. కేంద్రాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంతమేర తగ్గించాలని విజ్ఞప్తి చేసిన విషయంలో టెల్కోలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ దాదాపు 50 శాతం పైగా మాత్రం తగ్గించాలని కోరినట్లు పేర్కొన్నాయి. తగ్గింపు స్థాయి 50–60 శాతం ఉండాలని విజ్ఞప్తి చేసినట్లు ఒక టెల్కో ప్రతినిధి తెలపగా, మరో సంస్థ ప్రతినిధి 60–70 శాతం తగ్గింపు కోరినట్లు పేర్కొన్నారు. 3.3–3.6 గిగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీలో ప్రతీ మెగాహెట్జ్‌ స్పెక్ట్రంనకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ రూ.492 కోట్ల బేస్‌ ధరను సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఒకో బ్లాక్‌లో 20 మెగాహెట్జ్‌ చొప్పున విక్రయించాలని సూచించింది. దీని ప్రకారం టెల్కోలు .. స్పెక్ట్రం కొనుక్కోవాలంటే కనీసం రూ. 9,840 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో స్పెక్ట్రం వేలం వేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (సీవోఏఐ) వినతి ప్రాధాన్యం సంతరించుకుంది.  


ప్రస్తుత పరిస్థితి ఇది..    
ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన స్పెక్ట్రంతో టెలికం కంపెనీలు 5జీ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ స్పెక్ట్రం కాలపరిమితి 2022 మే వరకూ .. లేదా స్పెక్ట్రం వేలం ఫలితాలు వెల్లడయ్యే వరకూ (ఏది ముందైతే అది) ఉంటుంది. అయిదేళ్ల తర్వాత 2021 మార్చిలో నిర్వహించిన వేలంలో దాదాపు రూ. 4 లక్షల కోట్ల బేస్‌ ధరతో ప్రభుత్వం ఏడు బ్యాండ్‌లలో 2,308.8 మెగాహెట్జ్‌ స్పెక్ట్రంను వేలం వేసింది. అయితే, భారీ బేస్‌ ధర కారణంగా ఖరీదైన 700 మెగాహెట్జ్, 2,500 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లలో స్పెక్ట్రం అమ్ముడు పోలేదు. అప్పట్లో 3.3–3.6 గిగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంను కొన్ని కారణాల వల్ల వేలానికి ఉంచలేదు.  
 

మరిన్ని వార్తలు